
ప్రైవేట్‌పరం చేసిన మెడికల్ కాలేజీలను మళ్లీ వెనక్కి తీస
కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
ప్రొద్దుటూరు : పేద, మధ్యతరగతి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందని, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరులోని పుట్టపర్తి సర్కిల్‌లో మంగళవారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఒక్క మెడికల్ కళాశాల అయినా నిర్మించారా? అని ప్రశ్నించారు. జగన్ 17 మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చి మంజూరుచేశారన్నారు. వీటిలో ఐదు కళాశాలలను పూర్తి చేశారన్నారు. చేతకాని కూటమి ప్రభుత్వం అన్ని మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలోకి తీసుకొస్తోందన్నారు. ప్రతి మెడికల్ కళాశాలలో సూపర్ స్పెషాలిటీ హాస్పటిల్ ఉంటుందని, దీనివలన ఆయా ప్రాంతాల్లో పేద ప్రజలకు మంచి వైద్య సేవలు అందుతాయన్నారు. నిర్మాణం పూర్తయిన మెడికల్ కళాశాలలో మెడికల్ సీట్లను కూటమి ప్రభుత్వం తమకు వద్దని కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పనిసరిగా మళ్లీ వెనక్కి తీసుకుంటామన్నారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే కోటి సంతకాల ఉద్యమాన్ని చేపట్టామన్నారు. గవర్నర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళుతామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు ఆయిల్ మిల్ ఖాజా, పాతకోట బంగారు మునిరెడ్డి, ఎంపీపీ శేఖర్ యాదవ్, జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ శారద, వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్‌రెడ్డి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ఎంవీ రాజారాంరెడ్డి, ప్రచార కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు దావూద్, మున్సిపల్ కౌన్సిలర్లు, రాజపాళెం మండల అధ్యక్షుడు బాణా కొండారెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.