
గుండెపోటుతో వృద్ధుడు మృతి
బద్వేలు అర్బన్ : తన సోదరుడి కుమార్తె సమస్యను పరిష్కరించేందుకు పెద్ద మనిషిగా స్టేషన్‌కు వచ్చిన ఓ వృద్ధుడు స్టేషన్ ఆవరణలోనే గుండెపోటుకు గురై మృతి చెందాడు. మంగళవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. స్థానిక మిద్దెలవారిపాలెంకు చెందిన రాంచానిబాలగురయ్య (60) బేల్దారి పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. తన సోదరుడైన గురవయ్య కుమార్తె దేవి కొంత కాలంగా భర్త వేధింపులకు గురవుతోంది. ఈ నేపథ్యంలో దేవి తన భర్త సాయిపై అర్బన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఇరువురి తరపున పెద్ద మనుషులు స్టేషన్ ఆవరణలో సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో దేవి పెద్దనాన్న అయిన బాలగురయ్య ఒక్కసారిగా స్టేషన్ ఆవరణలోనే కుప్పకూలి పోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన బాలగురయ్యను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న అర్బన్ సీఐ లింగప్ప ప్రభుత్వాసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు.
చీటింగ్ కేసు నమోదు
కడప అర్బన్: కడప నగరం పూసల వీధికి చెందిన హరేరామ్‌కు ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం చేసిన వ్యక్తిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ పోలీసులు తెలిపారు. కడప పూసల వీధికి చెందిన హరి రామ్ బీటెక్ పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుండేవాడు. అనంతపురం జిల్లా నార్పలకు చెందిన ప్రసన్నకుమార్ రెడ్డి ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి దాదాపు రూ.1.30 లక్షలు వసూలు చేసి నకిలీ ఉద్యోగ నియామకపత్రం ఇచ్చాడు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేయడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రసన్నకుమార్‌రెడ్డి పై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.