
ఒంటరి వృద్ధురాలికి చేయూత
కడప అర్బన్ : నలుగురు కుమారులు ఉన్నా.. ఒంటరిగా జీవనం సాగిస్తున్న ఓ వృద్ధురాలికి చేయూత అందించేలా కడప జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్.బాబాఫక్రుద్దీన్ చొరవ చూపారు. ఆమె కుమారులకు కౌన్సిలింగ్ ఇచ్చి.. ఆసరా కల్పించాలే చేశారు. కడప తారకరామా నగర్‌లో నివాసముంటున్న బుసల లక్ష్మమ్మకు నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు బుసల రమణ కడపలో బేల్దారి పని చేస్తుండగా, ద్వితీయ, తృతీయ కుమారులు బుసల చిన్నప్ప, బుసల చంద్ర ఆటో నడుపుతున్నారు. నాలుగో కుమారుడు బుసల శ్రీనివాసులు కలకడలో టైల్స్ పని చేసుకుంటున్నారు. కుమార్తె బుసల రమణమ్మ కడపలో నివాసం ఉంటోంది. నలుగురు కుమారులు ఉన్నా.. ఆమె ఒంటరిగా జీవిస్తోందనే విషయం జడ్జి బాబాఫక్రుద్దీన్ దృష్టికి రావడంతో ఆయన స్పందించి లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులను ఇంటికి పంపారు. అక్కడికి వెళ్లిన న్యాయవాదులు ఆమెకు సాయం చేస్తామని తెలిపారు. అనంతరం జడ్జి ఎస్.బాబా ఫక్రుద్దీన్ లక్ష్మమ్మ కుమారులు, కుమార్తెలను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. వయో వృద్ధుల చట్టంపై వారికి అవగాహన కల్పించారు. పెద్ద కుమారుడు బుసల రమణ రూ.1500, ద్వితీయ, తృతీయ కుమారులు చిన్నప్ప, చంద్రలు ఒక్కొక్కరూ రూ.1500 ఇచ్చేలా ఒప్పందం కుదిర్చారు. ఆమె కుమారుల వద్దే ఉండేలా చూడాలని చెప్పారు. అనంతరం ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా న్యాయ సేవ అధికార సంస్థను సంప్రదించాలని వృద్ధురాలికి సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులు మనోహర్, రవితేజ సీనియర్ సిటిజన్ అయిన బుసల లక్ష్మమ్మ కుమారులు, కుమార్తె పాల్గొన్నారు.
జడ్జి బాబా ఫక్రుద్దీన్ చొరవతో
కదిలిన కుమారులు