
‘మాకు పరిహారం ఇప్పించండి’
జమ్మలమడుగు : ‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజోలి ప్రాజెక్టు నిర్మాణం కోసం 2008లో శంకుస్థాపన చేశారు. ఆయన మరణానంతరం ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సైతం రాజోలి ఆనకట్ట నిర్మాణానికి కట్టుబడ్డారు. అందుకు సంబంధించి భూసేకరణ కార్యక్రమాన్ని చేపట్టి అవార్డును పాసు చేయించారు. డబ్బులు పంపిణీ చేస్తారన్న సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో ప్రభుత్వం ఇవ్వలేదు. నాడు టీడీపీ నాయకులు రాజోలిఆనకట్ట నిర్మాణం చేసి బాధిత రైతులకు ఎకరాకు 24 లక్షల రూపాయల పరిహారం ఇస్తామని చెప్పారు. ఇంత వరకు ఇవ్వలేదు. రాబోయే కాలంలో వైఎస్సార్‌సీపీ నాయకులు తమకు మద్దతుగా నిలిచి పరిహారం అందేలా చూడాలి’.. అని రాజోళి బాధిత రైతులు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని కోరారు. ఈ సందర్భంగా సోమవారం బాధిత రైతులు వీరితో మాట్లాడుతూ రాజోలి ఆనకట్ట నిర్మాణం కోసం బాధిత రైతులకు ఎకరాకు 24 లక్షల రూపాయలు ఇస్తామని యువగళం పాదయాత్ర సమయంలో లోకేష్ పెద్దముడియం మండల పర్యటనకు వచ్చినప్పుడు హామీ ఇచ్చారన్నారు. ఇప్పటికి ప్రభుత్వం వచ్చి 17 నెలలు అయినా ఇప్పటి వరకు అవార్డు పాసైన రైతులకు పరిహారం గాని, రాజోలి ఆనకట్ట నిర్మాణం జరుగుతుందా జరగదా అన్న విషయంపై గానీ స్పష్టత ఇవ్వలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కూడా రూ.24 లక్షలు పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత పట్టించుకోలేదన్నారు. దీంతో ప్రతి ఏడాది కుందూ నదికి వరదలు వచ్చిన సమయంలో తమ భూములు ముగినిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ రాజోలి నిర్మాణం చేపడతారా లేదా, భూసేకరణ చేసిన రైతులకు పరిహారం ఎప్పుడు ఇస్తారు అన్న దానిపై శాసన మండలిలో ప్రశ్నించానిని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజోలి బాధిత రైతులకు పరిహారం ఇప్పించే విషయంలో వైఎస్ జగన్ నుంచి స్పష్టమైన హామీని రైతులకు ఇప్పించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డిని కోరారు. దీనిపై పి. రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ బాధిత రైతులకు ఎప్పటికి అన్యాయం జరగనివ్వమని కచ్చితంగా ఈ విషయాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
రాజోలి బాధిత రైతుల వినతి