
ప్రమాద బీమా.. తపాలా శాఖ ధీమా !
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఇటీవల ఓ వ్యక్తి పిల్లలను పాఠశాలలో వదిలిపెట్టి ఇంటికి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. దీంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది.
ఒక వ్యక్తి గుండె సమస్యతో ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులు దానికి ఆపరేషన్ అవసరమని... రూ.లక్ష వరకు ఖర్చవుతుందన్నారు. కొన్నాళ్ల తర్వాత మరో ఆసుపత్రికి వెళితే రూ.2 లక్షలు అవుతుందన్నారు.
ఏదైనా రోడ్డు ప్రమాదం సంభవించి గాయాలైనప్పుడు లేదా అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన సందర్భాల్లో ఇలా అధికంగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. కొన్నిసార్లు పాక్షికంగా, లేనిపక్షంలో తాత్కాలిక వైకల్యం కూడా ఏర్పడవచ్చు. ఈ క్రమంలో రక్షణగా ప్రైవేట్ బీమా పాలసీలు ఉన్నప్పటికీ ప్రీమియం అధికంగా ఉండటంతో వాటి పట్ల ప్రజలు ఆసక్తి కనబరచడం లేదు. ఈ తరుణంలో సామాన్యులకు అందుబాటులో ఉండేలా తపాలా శాఖ ప్రమాద బీమా పాలసీలను అందుబాటులోకి తెచ్చింది.
అర్హతలు..
బీమా పాలసీని 18 నుంచి 65 సంవత్సరాల వయసు గలవారు ఎవరైనా తీసుకోవచ్చు. దీన్ని తెరవడానికి దగ్గరలోని తపాలా కార్యాలయానికి వెళ్తే సరిపోతుంది.
ఆధార్ కార్డ్ దానితో లింక్ అయిన ఫోన్ నెంబర్ ఉండాలి. వైద్య పరీక్షలు చేసిన తర్వాత కొందరికి వర్తిస్తుంది. సాయుధ బలగాలకు ఇది వర్తించదు.
ఎంతో భరోసా...
● రోజుకు రూ.1.50తో రూ.10 లక్షలు, రూ.2తో రూ.15 లక్షలు విలువైన బీమా పాలసీలను తపాలా శాఖ అందుబాటులో తెచ్చింది. ఏడాదికి రూ.549 ప్రీమియంతో అకాల మరణాలకు రూ. 10 లక్షలు, రూ.749 ప్రీమియంతో రూ.15 లక్షల పాలసీలు అందుబాటులో ఉన్నాయి.
● ప్రమాదం కారణంగా శాశ్వత వైకల్యానికి పూర్తి బీమా చెల్లిస్తారు. అంగవైకల్యం లేదా పక్షవాతం వచ్చినా పూర్తి బీమా లభిస్తుంది.
● ప్రమాదం జరిగి ఆసుపత్రిలో ఉంటే రూ.60 వేల వరకు చెల్లిస్తారు.
● ఇద్దరు పిల్లలకు విద్యా ప్రయోజనం కింద గరిష్టంగా లక్ష రూపాయల వరకు లభిస్తుంది. ఒకవేళ ఫీజులు తక్కువగా ఉంటే వాటిని చెల్లిస్తారు.
● ప్రమాదం జరిగిన వ్యక్తి కోమాలోకి వెళ్తే రూ.లక్ష వరకు కవర్ చేస్తారు.
● ఎముకలు విరిగితే దాని ఖర్చుల నిమిత్తం రూ.లక్ష వరకు చేకూరుతుంది
● తలకు ఏదైనా దెబ్బ తగిలి మానసికంగా ఇబ్బంది పెడితే 4 కన్సల్టెంట్‌లు ఉచితం.
● ఒకరికి ప్రమాదం జరిగి వేరేచోట మరణించి ఉంటే వారి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి రావడానికి రూ.25 వేల వరకు చెల్లిస్తారు.
● ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులకు భరోసాగా రూ.5వేల వరకు లభిస్తుంది.
రోజుకు రూ.1.50తో రూ. 10 లక్షలు
రూ. 2 తో రూ. 15 లక్షలు
సామాన్యులకు అందుబాటులో తపాలా శాఖ బీమా పాలసీలు