
ఒంటరి జీవితంపై విరక్తితో మహిళ ఆత్మహత్య
ప్రొద్దుటూరు క్రైం : ఒంటరి జీవితం గడపలేక షేక్ ఆబిదా (42) అనే మహిళ బుధవారం ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సుందరాచార్యుల వీధికి చెందిన ఆబిదాకు రాజుపాళెం మండలం గోపల్లె గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. వారికి ఇమాంఖాసీం అనే కుమారుడు ఉన్నాడు. తరచు మనస్పర్థలు రావడంతో భార్యా భర్తలు ఏడేళ్ల క్రితం విడిపోయారు. కుమారుడు ఇమాంఖాసీం రెండేళ్ల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆమె ప్రొద్దుటూరులోని సుందరాచార్యుల వీధిలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఒంటరిగా ఉంటోంది. ప్రభుత్వం నుంచి పింఛన్ వస్తుండటంతో ఆ డబ్బుతోనే జీవనం సాగించేది. కుమారుడు మృతి చెందడం, భర్త దూరం కావడం.. ఈ రెండు ఘటనలు ఆమెను మానసికంగా కుంగదీశాయి. దీంతో ఒంటరితనాన్ని భరించలేని ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇంట్లో నుంచి పొగలు రావడంతో స్థానికులు గమనించి ఆమె బంధువులకు సమాచారం అందించారు. తల్లి, బంధువులు వచ్చేలోపే శరీరం పూర్తిగా కాలిపోయి ఆబిదా మృతి చెందింది. ఆబిదా తల్లి మెహరున్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ ఎస్‌ఐ సంజీవరెడ్డి తెలిపారు.