
పోలీసులు న్యాయం చేయాలి
మదనపల్లె : తనకు జరిగిన అన్యాయంపై పోలీసులే న్యాయం చేయాలని లేని పక్షంలో అత్మహత్యే శరణ్యమని హిజ్రా స్వాతి ఆవేదన వ్యక్తం చేసింది. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ స్థానిక చీకలగుట్టలో ఉంటున్న దంపతులు దమరేశ్వర్, స్వర్ణలత తన దగ్గర నుంచి డబ్బు తీసుకుని ఇవ్వకుండా వేధిస్తున్నారని వాపోయింది. తనను నమ్మించి రూ.45 లక్షల నగదు, ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు, బిడ్డల కోసం కొన్న బంగారు ఆభరణాలను తీసుకున్నారని, వాటిని తిరిగి చెల్లించాలని కోరుతుంటే బెదిరిస్తున్నారని పేర్కొంది. సీటీఎం రోడ్డులో తనపై దాడికి ప్రయత్నించారని కన్నీటిపర్యంతమైంది. ఒంటరిగా ఉన్న తనను ఏమైనా చేస్తారని భయాందోళన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లానని, పైసాపైసా కూడబెట్టిన డబ్బును, బిడ్డల కోసం కొన్న బంగారు ఆభరణాలను తిరిగి ఇప్పించకుంటే తనకు చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేసింది.