
ఉల్లి రైతులకు రూ.లక్ష పరిహారం ఇవ్వాలి
ప్రొద్దుటూరు : గిట్టుబాటు ధర లేని కారణంగా ఉల్లి పంట సాగు చేసిన రైతులు ఉరి వేసుకునే పరిస్థితులు దాపురించాయని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. బుధవారం ప్రొద్దుటూరులోని తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్ కడప జిల్లా ఉల్లి రైతులపై కూటమి ప్రభుత్వం వివక్షను ప్రదర్శించిందన్నారు. కనీసం కర్నూలు జిల్లా రైతుల వరకు అయినా న్యాయం చేయలేదన్నారు. ఎకరా ఉల్లి పంటను సాగు చేయాలంటే రూ.లక్ష పెట్టుబడి అవుతుందని, చాలా మంది రైతులు ఐదు ఎకరాల పంటను సాగు చేసి తీవ్రంగా నష్టపోయారన్నారు. ఎకరాకు 250 క్వింటాళ్ల పంట పండుతుందని, ధర ఉంటే మూడింతలు లాభాలు వస్తాయన్నారు. ఏ మాత్రం ధర లేని కారణంగా పండించిన పంటను రోడ్లపైనే పారేసే దుస్థితి ఏర్పడిందన్నారు. పంట సాగు చేసిన తర్వాత మూడు నెలల కాలంలో నిత్యం పంటకు కాపలా ఉంటూ సంరక్షించుకున్నా గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి హెక్టార్‌కు రూ.లక్ష పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలసి కలెక్టరేట్ ఎదుట 48 గంటలు నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. అప్పటికీ ప్రభుత్వంలో స్పందన రాకపోతే జోలె పట్టి విరాళాలు సేకరించి మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ద్వారా ఉల్లి రైతులకు అందజేస్తామన్నారు. ఉల్లి రైతుల సమస్యను ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారన్నారు. ప్రొద్దుటూరు, మైదుకూరు, పులివెందుల నియోజకవర్గాల పరిధిలో ఎక్కువగా ఉల్లిని సాగు చేశారని అన్నారు. వ్యవసాయంపై సీఎం చంద్రబాబుకు ఎప్పుడూ చిన్న చూపేనన్నారు. నష్టపోయిన ఉల్లి రైతులకు హెక్టారుకు రూ.50వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, అది ఏమాత్రం సరిపోదని, హెక్టారుకు రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి