
విద్యుదాఘాతంతో రైతు మృతి
లింగాల : లింగాల మండలం గుణకణపల్లె గ్రామంలో ఆదివారం రాత్రి విద్యుదాఘాఽతంతో కొమెర సురేష్ (30) అనే రైతు మృతి చెందాడు. ఎస్‌ఐ అనిల్ కుమార్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కొమెర సురేష్ తన పొలంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద పనులు నిర్వహిస్తుండగా, ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య వెంకటేశ్వరమ్మ, ఐదేళ్ల కుమార్తె వరలక్ష్మి ఉన్నారు. కుటుంబ పెద్ద ఆకస్మికంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నా యి. యువ రైతు మృతి చెందడంతో ఆయనకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
వడ్ల లారీ దగ్ధం
వీరపునాయునిపల్లె : మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయ సమీపంలో సోమవారం తెల్లవారుజామున వడ్లతో వెళుతున్న లారీ ప్రమాదవశాత్తు దగ్ధమైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రికి చెందిన ఏపీ 39 యూబీ 6567 నంబరు గల లారీ కమలాపురం నుంచి బంగారుపాలెంకు వడ్ల లోడుతో వెళుతుండగా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ లారీ నుంచి కిందకు దిగేసరికే మంటలు తీవ్రమయ్యాయి. వెంటనే వేంపల్లె ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే చాలా వరకు వడ్లతో పాటు లారీ కాలిపోయింది. మంటలు పూర్తి అదుపులోకి వచ్చినంత వరకు ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణహాని జరగలేదని ఏఎస్‌ఐ సుబ్రమణ్యం తెలిపారు.
రైలు కింద పడి
గుర్తు తెలియని వ్యక్తి మృతి
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ సమీపంలోని పెన్నానది బ్రిడ్జి వద్ద నంద్యాల–రేణిగుంట డెమో రైలు కింద పడి సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడికి సుమారు 50–55 ఏళ్లు ఉంటాయని రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి తల గుర్తు పట్టలేని విధంగా ఉందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించామన్నారు. మృతుడికి సంబంధించిన బంధువులు ఎవరైనా ఉంటే ఎర్రగుంట్ల రైల్వే పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు.
105 మద్యం బాటిళ్లు స్వాధీనం
రాజుపాళెం : మండలంలోని రెండు గ్రామాల్లో 105 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పీఎస్‌ఐ నాగకీర్తన తెలిపారు. గోపాయపల్లె గ్రామంలో ఇద్దరి నుంచి 52 మద్యం బాటిళ్లను, కుమ్మరపల్లె గ్రామంలో ఒక వ్యక్తి నుంచి 53 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.

విద్యుదాఘాతంతో రైతు మృతి