
హంద్రీ నీవా కాలువలో విద్యార్థి మృతదేహం లభ్యం
● అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
● మృతదేహాన్ని పరిశీలించిన
డీవైఈఓ లోకేశ్వరరెడ్డి
మదనపల్లె రూరల్ : హంద్రీ నీవా కాలువలో గల్లంతైన పదోతరగతి విద్యార్థి రెబ్బాన సాయికిరణ్(15) మృతదేహం సోమవారం ఉదయం బసినికొండ సమీపంలో లభ్యమైంది. ఫైర్ రెస్క్యూ టీం హంద్రీ నీవా కాలువలో మునిగిపోయిన సాయికిరణ్ మృతదేహాన్ని బయటకు తీశారు. పట్టణంలోని రామారావు కాలనీకి చెందిన సురేష్, సరళ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు సాయికిరణ్(16), బసినికొండలోని అభ్యుదయ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం స్కూల్‌లో పదోతరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు ఉండటంతో, సాయికిరణ్ సాయంత్రం 4.30 వరకు క్లాసులు ఉన్నాయని తల్లిదండ్రులకు చెప్పి స్కూటీలో వచ్చాడు. మధ్యాహ్నం 1 గంట వరకు క్లాసుకు హాజరయ్యాడు. స్కూల్ వదిలాక నేరుగా ఇంటికి వెళ్లకుండా మెయిన్‌రోడ్డు వరకు వచ్చి, తర్వాత స్నేహితులైన భానుతేజ, శేషుబాబు, సాత్విక్‌రెడ్డితో కలిసి ఈత కొడదామని స్కూటీలో పాఠశాల వెనుక వైపు ఉన్న హంద్రీనీవా కాలువ వద్దకు చేరుకున్నారు. కాలువలో అప్పటికే కొందరు యువకులు ఈత కొడుతుండటం చూసి సాయికిరణ్ కాలువలోకి దిగాడు. అప్పటికే కాలువలో నీటిప్రవాహ ఉధృతి అధికంగా ఉంది. గమనించని సాయికిరణ్ కాలువలో ముందుకు వెళ్లడంతో పట్టుతప్పి పడిపోయాడు. కొట్టుకుపోతుండగా, శేషుబాబు, ఈత కొడుతున్న యువకులను కాపాడాల్సిందిగా కోరాడు. వారు వెంటనే అక్కడకు వచ్చి సాయికిరణ్‌ను పట్టుకునే ప్రయత్నం చేయగా, చేతికి చిక్కి జారిపోయాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, వారు అగ్నిమాపక సిబ్బందికి తెలపడంతో సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థి ఆచూకీ కోసం సాయంత్రం వరకు గాలించారు. చీకటికావడంతో గాలింపు చర్యలకు తాత్కాలిక విరామం ఇచ్చారు. సోమవారం ఉదయం ఫైర్ రెస్క్యూ టీం హంద్రీ నీవా కాలువలో గాలిస్తుండగా, బసినికొండ నగరవనం సమీపంలో సాయికిరణ్ మృతదేహం లభ్యమైంది. కుమారుడిని కాలువలో విగతజీవిగా చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదించారు. కాగా సెలవు దినాల్లో తరగతుల నిర్వహణ సరికాదని పలువురు పేర్కొన్నారు.