
రాజోలి ముంపు వాసులకు న్యాయం చేయాలి
కడప సెవెన్‌రోడ్స్ : రాజోలి ప్రాజెక్టు ముంపు గ్రామాల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు సహదేవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎన్.జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి ఎన్.సుబ్బారెడ్డి, నర్రెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిలు డిమాండ్ చేశారు. సోమవారం బీకేఎస్ ఆధ్వర్యంలో పెద్దముడియం మండలంలోని రాజోలి ముంపు గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజోలి నిర్మాణానికి ఇప్పటికి రెండుమార్లు శంకుస్థాపనలు చేశారన్నారు. ఎకరాకు రూ. 12.50 లక్షలు చెల్లించాలని నిర్ణయించిన ప్రభుత్వం రైతుల భూ హక్కులను బ్లాక్ చేసిందన్నారు. తర్వాత రూ. 1350 కోట్ల అంచనా వ్యయంతో టెండరు ప్రక్రియ సైతం పూర్తి చేసి రెండేళ్లు దాటినా ఇప్పటికి రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపట్టలేదని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందన్నారు. ఇంతవరకు రైతులకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకపోవడం అన్యాయమన్నారు. దీంతో భూమి తాకట్టుపై బ్యాంకుల నుంచి రుణాలు రావడం లేదన్నారు. భూములు అమ్ముకునేందుకు కూడా వీలు లేకుండా ఉందన్నారు. ఎకరాకు నష్టపరిహారాన్ని రూ. 20 లక్షలకు పెంచి తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెద్దముడియం మండలంలోని నెమ్మళ్లదిన్నె, బలపనగూడూరు, ఉప్పలూరు, చిన్నముడియం తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు.
పెద్దముడియం మండల రైతుల ధర్నా