
దుంపలగట్టు కాలనీలో చోరీ
ఖాజీపేట : ఖాజీపేట మండలం దుంపలగట్టు గ్రామంలోని కాలనీలో చోరీ జరిగింది. ఈ ఘటనలో రూ. 20 వేల నగదుతోపాటు రూ.30 వేల విలువగల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. దుంపలగట్టు కాలనీలో చోరీ జరిగిన ఇంటి యజమాని వెంకటేశ్వర్లు కర్నూలులో ఉండగా, సోమవారం ఉదయం ఇంటి తలుపు పగులగొట్టి ఉన్న విషయాన్ని గమనించిన స్థానికులు అతనికి సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న వెంకటేశ్వర్లు మనవడు వచ్చి ఇంటిని పరిశీలించగా దొంగతనం జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఇంటి లోపల చుట్టూ కారంపొడి చల్లి ఉండడం, ఇంటిలోని సామగ్రి చిందరవందరగా ఉండటాన్ని గమనించారు. గత రెండు నెలలుగా తమ తాత వెంకటేశ్వర్లు అనారోగ్య కారణంగా కర్నూలులో ఉండడంతో ఇంటిలో ఎవరూ లేని విషయాన్ని గుర్తించి చోరీకి పాల్పడినట్లు అతను తెలిపాడు. ఈ మేరకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఖాజీపేట సీఐ వంశీధర్ తెలిపారు.