
మున్సిపల్ కార్మికుడి మృతి
ప్రొద్దుటూరు క్రైం : మండల పరిధిలోని వెటర్నరీ కాలేజీ మీపంలో ఉన్న డంప్‌యార్డులో కాసిపోయిన గంగయ్య (45) అనే మున్సిపల్ కార్మికుడు మృతి చెందాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దువ్వూరు మండలం నీలాపురం గ్రామానికి చెందిన గంగయ్య చెవిటి, మూగ. ఇతను దివ్యాంగుల కోటాలో రెండేళ్ల క్రితం ప్రొద్దుటూరు మున్సిపాలిటిలో పబ్లిక్ హెల్త్ వర్కర్‌గా ఉద్యోగం పొందాడు. పొట్టిపాడు రోడ్డులోని వెటర్నరీ కాలేజీ వద్ద ఉన్న డంప్ యార్డులో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతను శనివారం ఉదయం 6 గంటలకు నీలాపురం నుంచి విధులకు వచ్చాడు. రాత్రి అయినా ఇంటికి వెళ్లలేదు. గంగయ్య ఇంటికి రాని విషయం ఆదివారం అతని అన్న పుల్లయ్యకు తెలిసింది. దీంతో అతను పని చేస్తున్న చోటికి వెళ్లి విచారించగా శనివారమే గంగయ్య ఇంటికి వెళ్లినట్లు అక్కడి వారు చెప్పారు. ఈ క్రమంలో గంగయ్య మృతదేహం డంపింగ్ యార్డు సమీపంలో ఉండగా సోమవారం గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. తన తమ్ముడి మృతికి గల కారణాలను తెలుసుకోవాలని పుల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అరుణ్‌రెడ్డి తెలిపారు.