
న్యాయం చేయండి
ప్రొద్దుటూరు : ఓ వ్యక్తి తన నుంచి అక్రమంగా డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని, పోలీస్ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని రిటైర్డు అసిస్టెంట్ పోస్టుమాస్టర్ ఎ.శరత్‌బాబు కోరారు. ఆయన ఆదివారం సాక్షితో మాట్లాడారు. సాక్షి దినపత్రికలో బాధితుల తరఫున గత గురువారం ‘ఖాళీ చెక్కుతో కాసుల బేరం’ అనే శీర్షికతో వార్త ప్రచురితం కావడం తనకు సంతోషాన్ని, భరోసాను కలిగించిందని పేర్కొన్నారు. ఇంత కాలానికి జింకా రవి అనే వ్యక్తి గురించి వార్త వచ్చిందన్నారు. తాను కూడా గుర్రప్పస్వామి ఆటో ఫైనాన్స్ ఎండీ జింకా రవి బాధితుడినని తెలిపారు. ప్రొద్దుటూరులో అసిస్టెంట్ పోస్టు మాస్టర్‌గా పని చేస్తూ 2019 ఏప్రిల్ నెలాఖరున పదవీ విరమణ పొందానన్నారు. జింకా రవి అవసరం ఉన్న వారికి అప్పులు ఇప్పిస్తుంటాడని తెలుసుకుని 2015లో ఆశ్రయించానన్నారు. జె.సుబ్బరాయుడు, వద్ది ఓబయ్య అనే వ్యక్తులతో ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష డబ్బు ఇప్పించి తన కమీషన్ తీసుకున్నాడన్నారు. తనకు డబ్బు ఇచ్చిన వారికి ప్రామిసరీ నోట్లు రాయించానని తెలిపారు. నెలనెలా డబ్బుకు వడ్డీ ఇప్పించుకోవడం శ్రమతో కూడిన పని అని జింకా రవి తనతో సంతకాలు చేసిన ఆరు చెక్కులు తీసుకున్నాడన్నారు. చెక్కులు వాడలేదని, తాను డైరెక్ట్‌గా వడ్డీ చెల్లించి డబ్బు ఇచ్చిన వారితో షెటిల్ చేసుకున్నానన్నారు. ఖాళీ చెక్కులు ఇవ్వాలని రవిని అడిగితే కనిపించడం లేదని తెలిపాడన్నారు. గుడ్ విల్ కారణంగా అతనిని తాను ఖాళీ చెక్కుల కోసం ఒత్తిడి చేయలేదన్నారు. ఆయన 2017, 2018లో ఒక్కొక్క చెక్కుపై రూ.8 లక్షలు, రూ.10 లక్షలు తాను ఇవ్వాలని చెక్ బౌన్స్ కేసు తనపై వేశాడన్నారు. మరో చెక్కు ఉలసాల చలపతి అనే పేరుతో కేసు వేశాడన్నారు. ఓ చెక్కుకు సంబంధించిన కేసులో తాను ఓడిపోయి రూ.లక్షా 80 వేలు చెల్లించానన్నారు. ఇంకా కోర్టులో మూడు కేసులు ఉన్నాయని తెలిపారు. జింకా రవి పెద్ద సంఖ్యలో అనేక రకాల ప్రభుత్వ ఉద్యోగులపై ప్రొద్దుటూరు కోర్టులో కేసులు ఫైల్ చేశారన్నారు. దువ్వూరులో పని చేస్తున్న యనమల సుబ్బరాయుడు అనే ఉపాధ్యాయుడు ఇలా వేధింపులకు గురై చివరకు గుండెపోటుతో మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు.