
కాలుష్య నియంత్రణకు పటిష్ట చర్యలు
కడప సెవెన్‌రోడ్స్: కడప నగరంలో వాయు కాలుష్య నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నేషనల్ క్లియర్ ఎయిర్ ప్రోగ్రాం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో వాయు కాలుష్య నియంత్రణ అమలుపై ఏర్పాటైన జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు దేశంలోని వాయుకాలుష్యం కలిగిన 132 నగరాలలో కాలుష్య నియంత్రణకు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించిందన్నారు. వాటిలో కడప నగరం ఒకటని, ఈ ప్రాంతంలో వాయు కాలుష్యం వ్యాపించడంపై మూలకారణాలు తెలుసుకుని, వాటిని నియంత్రించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికబద్ధంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్య నియంత్రణకు నగరంలో పెద్దఎత్తున మొక్కల నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలని, వాహనాల ద్వారా కాలుష్యం వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో వాయు కాలుష్యం వ్యాప్తి చెందే ముఖ్యమైన ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాలలో వాయు కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. నగర ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో భాగంగా (ఎన్‌ఏఏపీ)కడపకు నగరానికి నిధులు కేటాయించామన్నారు. ఈ నిధులతో కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో చేపట్టిన వివిధ పనుల పురోగతిపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. పెండింగ్‌లోని సీసీ రోడ్లు, ప్లాంటేషన్ తదితర పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అనంతరం కడప కాలుష్య నియంత్రణ బోర్డ్ ఆధ్వర్యంలో రూపొందించిన దివాలి ఎకో ఫ్రెండ్లీ గిఫ్ట్స్ పోస్టర్స్‌ను కలెక్టర్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కడప నగర కమిషనర్ మనోజ్ కుమార్ రెడ్డి, పర్యావరణ ఇంజనీరింగ్ అధికారి సుధా కురుభ, మున్సిపల్ కార్పొరేషన్ ఎస్‌ఈ చెన్నకేశవరెడ్డి, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి