
ఒప్పందంలో ఏ తప్పు దాగుందో!
మళ్లీ శ్రీ భారత్ ఫార్మాకే...
సాక్షి,టాస్క్ ఫోర్స్: కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో రోగుల వైద్యం కోసం ఉపయోగించే ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా కాంట్రాక్ట్ వ్యవహారంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తోచిన రీతిలో అగ్రిమెంట్లు చేసుకుంటూ నిబంధనలకు నీళ్లొదులుతున్నారు.
వివరాల్లోకి వెళితే..
జిల్లాలోని ఎర్రగుంట్లకు చెందిన వారాశి సంస్థకు 2015 నుంచి 2020 వరకు రిమ్స్‌కు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చింది. అనంతరం మూడేళ్లు, ఆపై ఒక్కో ఏడాది పొడిగిస్తూ 2025 వరకు ఒప్పందం కొనసాగించారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జూలై 22న వారాశి సంస్థకే మరో ఏడాది రెన్యూవల్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం 2026 వరకు సదరు సంస్థకు ఒప్పందం ఉంది. తెరవెనుక ఏ మతలబు జరిగిందో.. ఏ రాజకీయ ఒత్తిడి ఎక్కువైందో గానీ రెన్యూవల్ ఉత్తర్వులు జారీ చేసిన 4 రోజులకే అంటే జూలై 26నే వారాశి సంస్థతో కుదుర్చుకున్న అగ్రిమెంట్‌ను రద్దు చేశారు. అదే నెల 30న కర్నూలుకు చెందిన శ్రీ భారత్ ఫార్మా సంస్థతో ఆక్సిజన్ సరఫరా కోసం కొత్త అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. నిజానికి శ్రీ భారత్ ఫార్మా కంపెనీకి 2018లోనే పదేళ్లపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు టెండర్లు పిలవకుండానే అగ్రిమెంట్ చేశారు. అందులో భాగంగానే 2021లోనే రిమ్స్‌కూ ఆక్సిజన్ సరఫరా చేయాలని శ్రీ భారత్ సంస్థను అధికారులు కోరారు. అప్పట్లో సిలిండర్ల సరఫరా చేయలేయమని శ్రీ భారత్ సంస్థ చేతులెత్తేసింది. దీంతో వారాశికే ప్రభుత్వం ఆక్సిజన్ సిలిండర్ల కాంట్రాక్ట్‌ను పొడిగించింది.
తాజాగా రిమ్స్‌కు ఆక్సిజన్ సరఫరా చేసే కాంట్రాక్ట్‌ను శ్రీ భారత్ ఫార్మా వారికి కట్టబెట్టారు. కాగా ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా సక్రమంగా చేయకపోవడం వల్ల 23 మంది ప్రాణాలు కోల్పోయారని తిరుపతిలో రుయా హాస్పిటల్ అధికారులు శ్రీ భారత్ ఫార్మాపై ఫిర్యాదు చేశారు. 2021 జూలై 23న ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో అలిపిరి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అలాంటి సంస్థకే కడప రిమ్స్ అధికారులు ఆక్సిజన్ సరఫరా కాంట్రాక్ట్‌ను కట్టబెట్టడాన్ని పరిశీలకులు తప్పుబడుతున్నారు. కాంట్రాక్ట్ మధ్యలో 2020 నుంచి 2025 వరకు ఐదేళ్లపాటు సరఫరా చేయలేని సంస్థకు కాంట్రాక్టు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. పైగా దక్షిణ భారతదేశంలోనే ఎక్కువ రేటుతో ఆక్సిజన్‌ను సరఫరా చేసే ఏకై క సంస్థ శ్రీ భారత్ ఫార్మా కంపెనీ కావడం గమనార్హం. మరోవైపు శ్రీ భారత్ ఫార్మా కంపెనీ ఏజెన్సీ విధానాలపై, కర్నూలు అనంతపురం జీజీహెచ్‌లలో జరుగుతున్న అవకతవకలపై ఇప్పటికే విజిలెన్స్ కమిటీతో విచారణ చేయాలని మంత్రి టీజీ భరత్ డిమాండ్ చేయడం గమనార్హం. అవినీతి ఆరోపణలు, కేసులు నమోదైన సంస్థకు, ఎక్కువ ధరకు మరోసారి రెన్యువల్ చేయడం వెనక మతలబు దాగి ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ‘ఒప్పందం’లో ఏ తప్పు దాగుందో సదరు అధికారులకే ఎరుక.
కడప రిమ్స్ లో’ ఆక్సిజన్ సరఫరా’కాంట్రాక్ట్ వ్యవహారంలో ’గోల్ మాల్ ’!
అధికార దర్పంతో అగ్రిమెంట్ రద్దుచేసి.. ఆపై మరో సంస్థకు కట్టబెట్టిన వైనం
అగ్రిమెంట్ దక్కించుకున్న ఏజెన్సీపై పలు ఆరోపణలు, కేసులు నమోదు

ఒప్పందంలో ఏ తప్పు దాగుందో!

ఒప్పందంలో ఏ తప్పు దాగుందో!