
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం
పులివెందుల: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతర పోరాటాలు కొనసాగిస్తుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం భాకారపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు చెప్పిన సూపర్ సిక్స్ హామీలు.. సూపర్ ఫ్లాప్‌గా మారాయని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు పండించిన ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధరలేక రైతన్నలు అవస్థలు పడుతున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతన్నలను ఆదుకున్నామని గుర్తు చేశారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు.
సబ్సిడీ శనగలు ఇవ్వడం లేదు..
ప్రభుత్వం ఇప్పటివరకు సబ్సిడీపై శనగలు అందించడంలేదని, విత్తనం వేసే టైంలో చాలా ఇబ్బందులు పడుతున్నామని మంగళవారం పులివెందుల, వేముల మండలాలకు చెందిన పలువురు రైతులు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో వాపోయారు. అధికారులను అడిగితే పట్టించుకోవడంలేదని, గత్యంతరంలేక ప్రైవేట్ వ్యక్తుల వద్ద అధిక ధరలకు శనగలు కొనుగోలు చేస్తున్నామని మొర పెట్టుకున్నారు. స్పందించిన ఎంపీ వ్యవసాయ శాఖ జేడీతో మాట్లాడారు. వెంటనే శనగలు సరఫరా చేయాలని సూచించారు. దీనికి జేడీ రెండు రోజుల్లో శనగల రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తామని ఎంపీకి వివరించారు.
ఉపాధి పథకం అనుసంధానానికి వినతి
రైతుల వ్యవసాయ పనులను ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేయాలని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఆర్‌సీడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రరెడ్డి రైతుల తరఫున వినతిపత్రం ఇచ్చారు. ఆర్‌సీడీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రఘురామిరెడ్డి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎద్దుల అర్జున్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ వేముల మండల అధ్యక్షులు నాగేళ్ల సాంబశివారెడ్డిలతో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంటలకు గిట్టుబాటు ధరలు లేక, రైతులు కూలీలకు వేతనాలు చెల్లించడంలో ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకాన్ని రైతుల వ్యవసాయ పనులకు నేరుగా అనుసంధానం చేయడంవల్ల రైతులకు కూలీల పెట్టుబడి భారం గణనీయంగా తగ్గి రైతులకు ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుందని పేర్కొన్నారు.
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి