
వరకట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : వరకట్నం వేధింపులకు ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, జిల్లా ఆస్పత్రి ఆవరణలో ఇరు కుటుంబాల సభ్యులు ఘర్షణకు దిగిన ఘటన మంగళవారం మదనపల్లెలో జరిగింది. బాధితుల వివరాల మేరకు.. పట్టణంలోని మోతీనగర్‌కు చెందిన వసీంకు రామసముద్రానికి చెందిన హీనా కౌసర్923)ను ఇచ్చి రెండేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. పెళ్లి అయిన నెల రోజుల నుంచే అత్తింటివారు అదనపు కట్నం కోసం తరచూ వేధించడం, కొట్టడం, తిట్టడం చేసే వారు. ఈ క్రమంలో మంగళవారం అదనపు కట్నం విషయమై మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపానికి గురైన హీనాకౌసర్ ఇంట్లో ఉన్న ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు మహమ్మద్ ఇర్ఫాన్, మదనపల్లెకు చేరుకుని హీనా కౌసర్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. భర్త వసీం అడ్డుకోవడంతో ఘర్షణ తలెత్తింది. మహమ్మద్ ఇర్ఫాన్‌పై వసీం కుటుంబసభ్యులు దాడికి దిగారు. అనంతరం హీనా కౌసర్‌ను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. ఆమెను 108 అంబులెన్స్ వాహనంలో ఎక్కిస్తుండగా, హీనా కౌసర్ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. అక్కడే ఉన్న వసీం కుటుంబ సభ్యులతో గొడవపడి కొట్టుకున్నారు. దీంతో టూటౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని బాధితురాలిని తిరుపతికి పంపించి, కుటుంబ సభ్యులను పంపేశారు.
ఆస్పత్రిలో కుటుంబసభ్యుల ఘర్షణ