
కడపలో విస్తృతంగా తనిఖీలు
కడప అర్బన్ : జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ ఎ.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చిన్నచౌకు పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కడప ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనుమానితులను విచారించి ఆరా తీశారు. అంబేద్కర్ సర్కిల్, వై.జంక్షన్, అప్సర సర్కిల్ ప్రాంతాల్లో వాహనాలను, బస్సులను తనిఖీ చేశారు. బస్ స్టాండ్ ఆవరణలోని పార్సిల్ కేంద్రంలో క్షుణ్ణంగా పరిశీలించారు. లాడ్జీలలో పోలీసులు ప్రతి గదిని నిశితంగా తనిఖీ చేసి, లాడ్జీలలో బస చేసిన వ్యక్తులను ప్రశ్నిస్తూ వారి వివరాలపై ఆరా తీశారు. లాడ్జీలలోని రిజిస్టర్‌ను పరిశీలించారు. లాడ్జీలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో చిన్నచౌకు సీఐ ఓబులేసు, ఎస్‌ఐ లు రాజరాజేశ్వర రెడ్డి, రవి కుమార్, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.