
టాలెంట్ హంట్ సెలక్షన్స్ వాయిదా
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: ఈనెల 13 నుంచి 16 వరకు జరగబోయే అండర్ 12, అండర్ 14, అండర్ 16, అండర్ 19, టాలెంట్ హంట్ సెలక్షన్లు అనివార్య కారణాలవల్ల వాయిదా పడింది.ఈ విషయాన్ని జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రెడ్డి ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.
కడప రూరల్: డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ శనివారం రెండోరోజుకు చేరింది. ప్రభుత్వం బిల్లులను చెల్లించకపోవడంతో ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఓపీతోపాటు సర్జరీలను పూర్తిగా నిలుపుదల చేశాయి. జిల్లావ్యాప్తంగా 119 నెట్ వర్క్ ఆసుపత్రులు ఉండగా అందులో 42 ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి. ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలుపుదల చేయడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఉచిత వైద్య సేవలు యధావిధిగా ఎప్పుడు కొనసాగుతాయోనని చర్చించుకుంటున్నారు.
కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 13వ తేదీ కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారతీయ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో రైతుల నిరసన ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని భారతీయ కిసాన్ సంఘం జిల్లా అధ్యక్షులు జనార్థన్‌రెడ్డి, కార్యదర్శి సుబ్బారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కడపలోని జెడ్పీ ప్రాగణం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలు దేరి 11 గంటల నుంచి 12 గంటల వరకు నిరసన తెలియచేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
కడప అగ్రికల్చర్: వైఎస్సార్ కడపజిల్లా రైతు సాధికారత సంస్థ వారి ఆధ్వర్యంలో నేషనల్ మిషన్ ఫర్ న్యాచురల్ ఫామింగ్(ఎన్‌ఎంఎన్‌ఎఫ్) పోగ్రాం ద్వారా బయో రీసోర్సు సెంటర్‌పై ఈ నెల 13వ తేదీ నుంచి నాలుగు రోజులపాటు ఉచితంగా శిక్షణ ఇవ్వననున్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రకృతి సేద్యం ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. తిరుపతిలో రెసిడెన్సియల్ శిక్షణా కేంద్రంలో శిక్షణకు ఆసక్తి గలిగిన రైతులు 9849900965 నెంబర్‌కు కాల్ చేసి పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.
కడప అగ్రికల్చర్: ఉపరితల ఆవర్తనం కారణంగా జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు వర్షాలు కురిశాయి. సీకేదిన్నెలో అత్యధికంగా 60.4 మిల్లీమీటర్ల వర్షం కురిసంది. ఆట్లూరులో 44.8 , గోవపరంలో 40.2, కడపలో 38.6 , చాపాడులో 35.4, పెండ్లిమర్రి, ఖాజీపేటలలో 33.2, సిద్దవటంలో 28.8, బద్వేల్‌లో 28.4 , పొద్దుటూరులో 18.8, లింగాలలో 18.2, చక్రాయపేటలో 17.2, బిమఠంలో 16.2 , కమలాపురంలో 12.4, చెన్నూరలో 11.2, తొండూరులో 10.2, వీఎన్‌పల్లిలో 9.6, వేంపల్లెలో 8 , మైదుకూరులో 7.4, పులివెందులలో 6, వేములలో 5, ఎర్రగుంట్లలో 4.4 , జమ్మలమడుగులో 3.4, ఒంటిమిట్టలో 3.2, వల్లూరులో 2.4, దువ్వూరులో 1.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
గాలివీడు: వరుణుడు ఉగ్రరూపం దాల్చడంతో అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో శుక్రవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. 108.4 మిల్లీ మీటర్లుగా నమోదైందని ఏఎస్‌ఓ శ్రీదుర్గ తెలిపారు. ఈ వర్షానికి చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లి ప్రవహించాయి. వెలిగల్లు జలాశయానికి వదర ప్రవాహం పెరగడంతో 3.027 నీటిమట్టం టీఎంసీలకు చేరుకుందని డీఈ శిరీష్‌కుమార్ తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 4.64 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.11 టీఎంసీలకు చేరింది. మండలంలోని గోరాన్ చెరువు నుండి వడిశలంకపల్లి వరకూ వరద నీరు పెరగడంతో పెద్ద చెరువుకు నీరు చేరింది. ఎల్లంపల్లి కుషావతి రిజర్వాయర్ నుంచి నడింపల్లి మీదుగా వచ్చే ప్రవాహంతో చిన్నేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.