
కూటమి ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం
● ప్రజల సమక్షంలో
కోటి సంతకాల సేకరణ
● జిల్లా వ్యాప్తంగా
రచ్చబండ కార్యక్రమాలు
● మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మాజీ మేయర్ సురేష్‌బాబు
కడప కార్పొరేషన్ : వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ చేపడుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మాజీ మేయర్ కె.సురేష్‌బాబు పిలుపునిచ్చారు. మాజీ డిప్యూటీ సీఎం కార్యాలయంలో శనివారం సంబంధిత కార్యక్రమ పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్. జగన్‌మోహన్ రెడ్డి దూరదృష్టితో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల తీసుకువస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ అనుచరులు, బినామీలకు దోచిపెట్టేందుకు ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. పీపీపీ విధానం అంటూ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి నవంబర్ 22వ తేదీ వరకూ రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి సంతకాలు సేకరిస్తామన్నారు. అక్టోబర్ 23న నియోజవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సేకరించిన సంతకాల పత్రాలను గవర్నర్‌కు అందజేస్తామని వారు వివరించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం చేస్తే మెరుగైన వైద్యం ఎలా అందుతుందని వారు ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అతివృష్టి లేక అనావృష్టి వచ్చి రైతులు నష్టపోతున్నారన్నారు. ఈ ఏడాది కూడా గిట్టుబాటు ధర లేక పండించిన పంట నీటిపాలైందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసే ప్రతి మూడు బాటిళ్లలో ఒక బాటిల్ కల్తీదని అంజద్‌బాషా అన్నారు. పర్మిట్ రూంలో తాగిన కొన్ని క్షణాల్లోనే వ్యక్తి మృతి చెందడానికి కారణం కల్తీ మద్యమేనన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి.జయచంద్రారెడ్డి, ఎస్‌ఈసీ సభ్యులు ఎస్.యానాదయ్య, గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్, కార్పొరేటర్లు కె.బాబు, షఫీ, బాలస్వామిరెడ్డి, పార్టీ నాయకులు శ్రీరంజన్‌రెడ్డి, సీహెచ్.వినోద్, గౌస్, అక్బర్, బండి ప్రసాద్, రామ్మోహన్‌రెడ్డి, డిష్‌జిలాన్, రెడ్డి ప్రసాద్, రహీం, టీపీ వెంకట సుబ్బమ్మ,బండి దీప్తి, మరియలు తదితరులు పాల్గొన్నారు.