
డిమాండ్లు అంగీకరించకుంటే 15 నుంచి సమ్మె
ఎర్రగుంట్ల : విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల, ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్లను అంగీకరించకుంటే ఈ నెల 15వ తేదీ తర్వాత నిరవధిక సమ్మెకు వెళ్తామని విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.సుబ్బిరెడ్డి తెలిపారు. గురువారం ఆర్టీపీపీలోని యూనియన్ కార్యాలయంలో ఉద్యమ కార్యాచరణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు కాంట్రాక్టు కార్మికులు చాలా తక్కువ వేతనాలకు పని చేస్తున్నారని వారిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులను విస్మరించడం పరిపాటిగా మారిందన్నారు. అలాగే విద్యుత్ ఉద్యోగులకు డీఏలు కూడా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ నెల 14వ తేదీన వర్క్ టూ రూల్ పాటిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.