
స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి
కడప అర్బన్ : త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు వీలుగా ఇప్పటినుండే తగిన ప్రణాళికలు రూపొందించాలని జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి. మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు వీలుగా సమస్యలు సృష్టించే వారు, ఎన్నికల నేరాలకు పాల్పడినవారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలైన మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా భద్రత కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఈవ్ టీజింగ్, మహిళలు, చిన్నారులపై నేరాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి, డ్రగ్స్ పై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ఉక్కుపాదం మోపాలన్నారు. జిల్లాలో నేరాల నిరోధానికి అన్ని సబ్–డివిజన్‌లలో క్రైం పార్టీలను ఏర్పాటు చేయాలని డీఎస్పీలకు సూచించారు. రోడ్డు భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఎస్పీ సూచించారు. మైనర్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసే వారిపై ఎం.వి యాక్ట్ మేరకు కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగేలా రోడ్లపై అడ్డంగా వాహనాలు నిలిపి ఉంచితే సీజ్ చేసి స్టేషన్ కు తరలించాలని, జరిమానా విధించాలని ఆదేశించారు. సోషల్ మీడియా లో మహిళలపై, బాలికలపై అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి నిర్ణీత గడువులోగా, చట్ట పరిధిలో పరిష్కారం అయ్యేలా చూడాలని సూచించారు. దీపావళి పండుగ నేపథ్యంలో బాణాసంచా దుకాణాలు, గోడౌన్ లలో తనిఖీ లు నిర్వహించాలని, నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసినా, విక్రయించినా వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రొద్దుటూరు రూరల్ పరిధిలో హత్య కేసును త్వరితగతిన ఛేదించిన డీఎస్పీ పి.భావన, ప్రొద్దుటూరు రూరల్ సి.ఐ ఎం.నాగభూషణ్, సిబ్బందిని జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందచేశారు.
ఈ నేర సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ (ఏ.ఆర్) బి.రమణయ్య, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.సుధాకర్, కడప డీఎస్పీ ఎ.వెంకటేశ్వర్లు, ప్రొద్దుటూరు డీఎస్పీ పి.భావన, పులివెందుల డీఎస్పీ బి.మురళి నాయక్, మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్, జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వర రావు, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ బాలస్వామిరెడ్డి, డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం, జిల్లాలోని సి.ఐలు, ఎస్.ఐలు, ప్రత్యేక విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.
నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ
షెల్కే నచికేత్ విశ్వనాథ్ దిశా నిర్దేశం