
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
తొండూరు : తొండూరు మండలం మల్లేల గ్రామానికి చెందిన నరేష్ (40) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం రాత్రి మల్లేల గ్రామంలోని ఓ రైతు పొలంలో ఈ ఘటన జరిగింది. మృతుడు నరేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నరేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఘన మద్దిలేటి తెలిపారు.
వ్యవసాయ మోటార్లు చోరీ
రాజుపాళెం : మండలంలోని వెలవలి గ్రామంలో రెండు వ్యవసాయ మోటార్లు చోరీ అయ్యాయి. గ్రామానికి చెందిన రిటైర్డు పోలీసు బసవయ్య, న్యాయవాది రావుల సురేంద్రనాథ్‌రెడ్డి పొలాలకు విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేసుకున్నారు. గురువారం మోటార్లను ఆన్ చేసేందుకు కాపలాదారుడు చిన్న కొండయ్య వెళ్లగా అక్కడ రెండు మోటార్లు లేవు. ఈ విషయాన్ని యజమానులకు తెలిపారు. ఈ సంఘటనపై రాజుపాళెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెలవలి గ్రామంలో గతంలో ఏడు మోటార్లు చోరీ అయినట్లు బాధిత రైతులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరికి గాయాలు
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణం అంబకపల్లె రోడ్డులోని స్థానిక పాల్‌రెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద బొలేరో వాహనాన్ని ద్విచక్ర వాహనం ఢీకొంది.
బీహార్‌కు చెందిన శివకుమార్ పాండే దువ్వూరు మండలం లిల్లాపురం గ్రామానికి చెందిన కోట రామేశ్వరరెడ్డిలు కూలి పనుల నిమిత్తం అరటి కాయలు కోసేందుకు ప్రతిరోజు ద్విచక్ర వాహనంలో వస్తుంటారు. ఈ నేపథ్యంలో నల్లపురెడ్డిపల్లె గ్రామం రోడ్డు వైపు నుంచి ద్విచక్ర వాహనంలో వేగంగా వచ్చి బొలెరో వాహనాన్ని ఢీకొన్నారు. ఈ ఘటనలో ఇరువురికి గాయాలు కావడంతో చికిత్స కోసం వారిని 108 వాహనంలో సర్వజన ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కడపకు రెఫర్ చేసినట్లు పోలీసులు తెలిపారు.