
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ తగదు
ప్రొద్దుటూరు : మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయడం తగదని రాయలసీమ పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ములపాకు ప్రతాప్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పేదలకు ఫీజు లేకుండా అన్ని సేవలు అందుతాయని, ప్రైవేట్ ఆధ్వర్యంలో పేదలకు ఎంత వరకు సౌకర్యాలు అందుతాయని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం పీపీపీ విధానం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
నగరిగుట్టలో పట్టపగలే చోరీ
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని నగరిగుట్టలో నివాసముంటున్న రాజ కుల్లాయప్ప ఇంట్లో గురువారం పట్టపగలే దొంగలు పడ్డారు. రాజకుళ్లాయప్ప కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గురువారం యథావిధిగా రాజకుళ్లాయప్ప కూలి పనులకు వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చొరబడి 6 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి, రూ.20వేల నగదుతో పాటు ఒక కోడిని అపహరించుకెళ్లారని బాధితులు తెలిపారు. పులివెందుల పట్టణంలో పట్టపగలే దొంగతనాలు జరుగుతుండటంతో పులివెందుల ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
మందులపై జీఎస్టీ రేట్లు తగ్గింపు
కడప ఎడ్యుకేషన్ : కడప నగరంలోని ఐ.ఎం.ఏ కార్యాలయంలో జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టాల్ ను ఏర్పాటు చేసి జీఎస్టి రేట్ల తగ్గింపు పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. తొలుత కర్నూల్ డ్రగ్ కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ నాగ కిరణ్ కుమార్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ నాగరాజు, అడిషనల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్ రవిబాబు స్టాల్ ను పరిశీలించి అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు నరసింహమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత నెల 22వ తేదీ నుంచి వినియోగదారునికి మేలు జరిగేలా జీఎిస్ట్టీలో భారీ మార్పులు చేసిందన్నారు. జిల్లా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సెక్రెటరీ కె. వెంకటేశ్వర్లు, సభ్యులు పాల్గొన్నారు.