
పంటల బీమా వివరాలను ఆర్‌బీకేల్లో ప్రదర్శించాలి
కడప కార్పొరేషన్ : పంటల బీమా ఎంతమంది రైతులకు మంజూరైందో తెలిపే వివరాలను రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించాలని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి కోరారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2023 నుంచి 2024 ఖరీఫ్ వరకు ప్రధాన మంత్రి పసల్ బీమ్ యోజన కింద రూ.137 .75 కోట్లు, వాతావరణ ఆధారిత బీమా కింద సుమారు రూ.35.25 కోట్లు నిధులు విడుదలయ్యాయన్నారు. దీంతో పాటు 2022–23 రబీ కాలానికి శనగ, మినుము, పెసర, వేరుశనగ పంటలు సాగుచేసి నష్ట పోయిన 77,995 మంది రైతులకు రూ.14.46 కోట్లు విడుదలైందన్నారు. 2023 ఖరీఫ్‌లో వరి పంట సాగు చేసిన 87,143 మంది రైతులకు రూ. 15.44 కోట్లు వచ్చిందని, 2023–24 రబీలో శనగ, నువ్వులు సాగు చేసిన 90, 126 మంది రైతులకు రూ.77.74 కోట్ల నిధులు విడుదల చేశారన్నారు. 2024 ఖరీఫ్‌లో వరి, మినుము, జొన్న పంటలను సాగు చేసి నష్ట పోయిన 97,361 మంది రైతులకు రూ. 28.11 కోట్లు వచ్చింది. ఇవి కాకుండా వాతావరణ ఆధారిత బీమ కింద దాదాపు 35.25 కోట్లు వచ్చాయన్నారు. పంటల బీమాకు సంబంధించి రూ.173 కోట్లు జిల్లా కు విడుదల చేశామని 50 రోజులుగా కేవలం పత్రికా ప్రకటనలతోనే రైతులను అయోమయంలో పడేస్తున్నారన్నారు. ఇప్పటికై నా ఆయా జాబితాలను ఆర్‌బీకేల్లో ప్రదర్శించాలని కోరారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు రఘునాథరెడ్డి, చీర్ల సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.