
శభాష్ పోలీస్!
రాజుపాళెం : ఏం కష్టమొచ్చిందో ఆ వృద్ధురాలికి జీవితంపై విరక్తి కలిగింది. కుందూనదిలో దూకేందుకు వెళుతుండగా ఆ దారిలో వెళుతున్న కొంతమంది యవకులు, ఖాకీలు గమనించి ప్రాణాలు కాపాడారు. వివరాల్లోకి వెళితే... ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన ఓ కళాశాలలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న శివుడు భార్య ఈడిగ రమణమ్మ రాజుపాళెం మండలంలోని వెల్లాల గ్రామ సమీపంలోని కుందూనదిలో గురువారం దూకాలని వెళ్లింది. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న కొంతమంది యువకులు ఆ దారిలో వెళుతూ ఇదేంటి వృద్ధురాలు కుందూనది వద్ద ఉంది అని వెంటనే వారు రాజుపాళెం ఎస్‌ఐ కె.వెంకటరమణకు సమాచారం అందించారు. వెంటనే ఎస్‌ఐ పోలీసులు కిరణ్ బాబు (సీపీ 894), ఎం. రవిబాబు (పీసీ 671)లను వెల్లాల కుందూనది వద్దకు పంపారు. జీవితంపై విరక్తి చెంది కుందూనదిలోకి దూకాలనుకున్న రమణమ్మతో పోలీసులు మాట్లాడి ఆమె వివరాలు తెలుసుకొని రాజుపాళెం పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చారు. అక్కడ ఎస్‌ఐ వెంకటరమణ, పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం ఆమె భర్త ఈడిగ శివుడుకు రమణమ్మను అప్పగించారు. వృద్ధ మహిళను కాపాడిన పోలీసులు కిరణ్ బాబు, రవి బాబులతో పాటు ఎస్‌ఐ ఏఎస్‌ఐలను గ్రామస్తులు శభాష్.. పోలీస్ అంటూ ప్రశంశించారు. రమణమ్మ భర్త శివుడు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.