
టీడీపీలో ఇరువర్గాల ఘర్షణ
పులివెందుల రూరల్ : పులివెందుల మండలం ఆర్.తుమ్మలపల్లె గ్రామంలో గురువారం డబ్బులు బాకీ విషయమై టీడీపీకి చెందిన నాగయ్య, రామాంజనేయరెడ్డి వర్గీయులు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఇరు వర్గాలకు చెందిన నలుగురికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. ఆర్.తుమ్మలపల్లె గ్రామానికి చెందిన నాగయ్య అనే వ్యక్తి రామాంజనేయరెడ్డి నుంచి రూ.90లక్షలు డబ్బులు తీసుకున్నాడు. ఈ డబ్బులు మూడేళ్లలోపు తిరిగి చెల్లించాలని, ప్రతి ఏడాది వడ్డీ డబ్బులు కట్టాలని ప్రామిసరీ నోటు రాయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలో రూ.6లక్షల వడ్డీ డబ్బులు కట్టలేదని, డబ్బుల విషయమై రామాంజనేయరెడ్డి, నాగయ్య వర్గాల వారు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో నాగయ్యతోపాటు ఆయన కుమారుడు అనిల్ కుమార్, రామాంజనేయ రెడ్డి వర్గానికి చెందిన గంగాధర్ రెడ్డి, మల్లారెడ్డిలకు గాయాలయ్యాయి. దీంతో చికిత్స కోసం వారిని 108 వాహనంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. నాగయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కడపకు రెఫర్ చేసినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘర్షణకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
డబ్బులు బాకీ విషయమై కత్తులతో దాడి