
పార్టీని బలోపేతం చేద్దాం
మద్యంలో 25 శాతం నకిలీదే
● రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది
● లక్షల కోట్లు దోచుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు
● ఏ ముఖ్యమంత్రి ఇంత దిగజారి
ప్రవర్తించలేదు
● వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
కడప కార్పొరేషన్ : గ్రామ స్థాయి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దామని ఆ పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం రామాంజనేయపురంలోని నూతన జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రైతులు పండించిన ఏ పంటలకు సరైన గిట్టుబాటు ధర లేదన్నారు. లక్షకోట్లు విలువజేసే మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. సహజ వనరులను దోచుకుంటున్నారని, రోజూ లక్షల కోట్లు దోచు కోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని కూటమి తీరుపై దుయ్యబట్టారు. తాను 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, ఏ ముఖ్యమంత్రి ఇంత దిగజారి ప్రవర్తించలేదన్నా రు. పెదబాబుకు, చినబాబుకు తెలియకుండానే నకిలీ మద్యం స్కాం జరిగిందా అని సూటిగా ప్రశ్నించారు.
● పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో నకిలీ మద్యం విచ్చలవిడిగా సరఫరా అవుతోందన్నారు. ప్రతి నాలుగు బాటిళ్లలో ఒకటి నకిలీ బాటిల్ ఉందన్నారు. పేదలకు విద్య, వైద్యం దూరం చేసేందుకే మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అందరం సమిష్టిగా కృషి చేయాలన్నారు.
● రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీని పటిష్టం చేసుకోవాలన్నారు. జగన్ 2.0లో కార్యకర్తల ద్వారానే ప్రభుత్వ పాలన జరుగుతుందని తెలిపారు.
● బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా రాలేదని, ఒకట్రెండు వచ్చినా అవి ప్రైవేటు కాలేజీలేనని తెలిపారు. మాజీ సీఎం వైఎస్ జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తెస్తే వాటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు అప్పగించడం దారుణమన్నారు.
● మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రమంతా నకిలీ మద్యం సరఫరా అవుతోందన్నారు. నకిలీ మద్యం స్కాంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
● మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదన్నారు. యూరియా బ్లాక్‌లో కొనాల్సిన దుస్థితి ఉందన్నారు.
● వైఎస్సార్‌సీపీ జోనల్ కో ఆర్డినేటర్ చల్లా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రవేటీకరణపై ఉద్యమం చేపట్టాలని పార్టీ నిర్ణయించిందని, దాన్ని పార్టీ కార్యకర్తలు జయప్రదం చేయాలన్నారు. నవంబర్ 22 వరకూ గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించాలని, ఆ క్రమంలోనే గ్రా మ కమిటీలు ఏర్పాటు చేసి, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేయాలన్నారు. ఈనెల 28న నియోజకవర్గాల స్థాయిలో ర్యాలీలు చేపట్టాలని, నవంబర్ 12న జిల్లా స్థాయిలో సంతకాల సేకరణ చేపట్టాలన్నారు. వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటు పరిశీలకులు కొండూరు అజయ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పి. రామసుబ్బారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, రమేష్ యాదవ్, పార్టీ రాష్ట్ర అఽధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, మాజీ మేయర్ కె. సురేష్ బాబు, సీఈసీ సభ్యులు మల్లికార్జునరెడ్డి, ఎస్‌ఈసీ సభ్యులు మాసీమ బాబు, ఆర్. వీరారెడ్డి, ఇ. తిరుపాల్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పోతుల శివారెడ్డి పాల్గొన్నారు.
నకిలీ మద్యం స్కాంలో ఉన్నవారంతా చినబాబు సన్నిహితులే
వైఎస్సార్‌సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజం
కడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యంలో 25 శాతం నకిలీదేనని, ప్రతి నాలుగు బాటిళ్లలో ఒకటి నకిలీదని వైఎస్సార్‌సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. గురువారం కడపలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 16 నెలల్లో ప్రతిరోజూ ఏదో ఒక అవినీతి కార్యక్రమం చేస్తున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి ఓట్లేసిన పాపానికి ఎరువులు, విత్తనాలు లేక రైతులు బాధపడుతున్నారన్నారు. తంబళ్లపల్లెలో లక్షలాది నకిలీ మద్యం బాటిళ్లు బయటపడ్డాయని, ప్రభుత్వం సరఫరా చేసే మద్యంలో 25 శాతం నకిలీదేనన్నారు. ఇంత జరుగుతున్నా డీఫ్యాక్ట్ సీఎం లోకేష్‌కు, ఇంటెలిజెన్స్, పోలీసు, ఎక్సైజ్ వారికి తెలియకపోవడం హాస్యాస్పదమన్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడిందని, తనిఖీల్లో దొరికిన బాటిళ్ల లేబుళ్లన్నీ ఇతర రాష్ట్రాల కు చెందినవని, ఇతర రాష్ట్రాల వారే దీన్ని బయటపెట్టారన్నారు. నెల్లూరు, ఒంగోలు, క్రిష్ణా, ఇబ్రహీం పట్న, ఏలూరు, అనకాపల్లి ప్రాంతాల్లో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు బయటపడ్డాయన్నారు. వాటికి సారథ్యం వహించేవారంతా చినబాబు సన్నిహితులేనని ఆరోపించారు. తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జి తన కోవర్టయితే రూ.50కోట్లు తీసుకొని టికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఆయన మరో రూ.50 కోట్లు ఎన్నికల్లో ఖర్చు చేశారని, తన కోవర్టు అయితే ఇంతకాలం వారు ఎందుకు పట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. చీఫ్ లిక్కర్ తాగి అనేకమంది చనిపోతున్నారని, తమ ఆదాయం కోసం ఇంత నీచానికి దిగజారడం దారుణమన్నారు. పచ్చ మీడియా సిగ్గుశరం లేకుండా, మానవత్వం మరిచి ఈ తప్పులను దాచిపెట్టి, మూసిపెట్టడం అన్యాయమన్నారు. ఏదో ఒకరోజు వారు దీనికి పశ్చాత్తాప పడక తప్పదని హెచ్చరించారు. నర్సీపట్నంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు అద్భుత స్పందన వచ్చిందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా లక్ష మంది జనం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు.