
కూటమిపై గురువుల తిరుగుబావుటా !
● ప్రభుత్వ పాఠశాలల్లో బోధనేతర
కార్యక్రమాలన్నీ నిలుపుదల
● నేటి నుంచి అన్ని పాఠశాలల్లో
అమలుకు గురువుల అడుగులు
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖలు విద్యారంగంలో అవలంబిస్తున్న ప్రయోగాలను, తిరోగమన విధానాలను వ్యతిరేకిస్తూ గురువులు తిరుగుబావుటా ఎగురవేశారు. పాఠశాలల్లో ఈనెల 10వ తేదీ నుంచి బోధనేతర కార్యక్రమాలను బహిష్కరించనున్నారు. ఈ మేరకు ఫ్యాప్టో నిర్ణయం తీసుకుంది. ఈ నెల 7వ తేదీ విజయవాడలో జరిగిన ఫ్యాప్టో రాష్ట్రకార్యవర్గంలో తీసుకున్న నిర్ణయాన్ని శుక్రవారం నుంచి అమలుకు శ్రీకారం చుడుతున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన తప్ప మరే ఇతర కార్యక్రమాలను నిర్వహించకూడదని ఫ్యాప్టో నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఫ్యాప్టో నాయకులు కలెక్టర్‌తోపాటు డీఈఓ, ఆయా మండలాల ఎంఈఓలకు వినతిపత్రాలను అందజేయనున్నారు.
లెక్కలేనన్ని బోధనేతర కార్యక్రమాలు
జూన్ నెల నుంచి యోగాంధ్ర పేరుతో కార్యక్రమాలు, మెగా పేరెంట్ టీచర్ మీటింగ్, జీఎస్టీ 2.0 పేరుతోనే మొక్కల పెంపకం, విద్యార్థుల వివరాలు, విద్యా కానుకలను విద్యార్థులకు అందజే యడం వాటి వివరాలను కూడా ఆన్లైన్ చేస్తున్నారు. దీంతోపాటు రోజుకు ఒక నివేదికను ఎంఈఓ ఆఫీస్ కు పంపాల్సిన పరిస్థితి ఉంది. అలాగే విద్యార్థుల అడ్మిషన్ ప్రక్రియ ఆన్లైన్.. ఇవన్నీ ఉపాధ్యాయుల బోధనకు ఆటంకం కల్గించే విషయాలని.. వీటన్నింటిని నిలిపి వేస్తున్నట్లు వారు ప్రకటించారు. దీంతోపాటు అసెస్మెంట్ పుస్తకాలు, టీచర్ హ్యాండ్ బుక్ ఉపాధ్యాయులకు పరిధికి మించి భారంగా మారింది. ఈ పరిస్థితులన్నీ ఉపాధ్యాయులను బోధనకు దూరం చేస్తున్నాయని వాపోయారు.
ఆర్థిక పరమైన సమస్యలను...
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు సంబంధించిన పలు రకాల ఆర్థిక పరమైన సమస్యల పరిష్కారించాల్సి ఉంది. వాటన్నింటి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా వారితో వెట్టిచాకిరి చేయించుకుంటుంది. దీంతో విసిగిపోయిన గురువులు పలుమార్లు తమ ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధ్యాయుల సమస్యలే పట్టలేదు. దీంతో విసుగు చెందిన ఉపాధ్యాయులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ఇందులో భాగంగానే పాఠశాలల్లో బోధనేతర కార్యక్రమాలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.