
అభివృద్ధిలో లక్ష్యసాధనకు కృషి
కడప సెవెన్‌రోడ్స్ : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను నిర్దేశిత లక్ష్యం మేరకు పూర్తి చేయాలని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి జీఎస్‌డబ్ల్యూఎస్ సేవలు, వైద్య ఆరోగ్య సదుపాయాలు, పౌరసరఫరాల, రైతు సేవా కేంద్రాల్లో సేవలు, పీఎంఏజీవై, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిహారం తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి కలెక్టర్.తోపాటు జేసీ అదితి సింగ్ హాజరయ్యారు. సీఎస్ వీసీ ముగిసిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు, డ్రగ్స్ పంపిణీ, ఆసుపత్రులలో పారిశుధ్యం, ఆసుపత్రులలో రోగ నిర్ధారణ సేవలపై దృష్టి సారించాలన్నారు. దీంతో పాటు పలు సూచనలు చేశారు. సీపీఓ హాజరతయ్యా,జెడ్పీ సీఈవో ఓబులమ్మ,మెప్మా పిడి కిరణ్ కుమార్,సోషల్ వెల్ఫేర్ డీడీ సరస్వతి పాల్గొన్నారు.
ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయాలి
జిల్లాలో వరి ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ అదితి సింగ్,వ్యవసాయ శాఖ అధికారులు, సివిల్ సప్లై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. జిల్లాలో ఏర్పాటు చేయనున్న దాదాపు 9 ఆర్‌ఎస్‌కే కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని అన్నారు. తొలి ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి కనీస మద్దతు ధర క్వింటాలుకు గ్రేడ్ ‘ఏ’ రకానికి రూ.2389 లుగా, సాధారణ రకానికి రూ.2369 లుగా మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందన్నారు. ప్రస్తుతం వేంపల్లి–1, కమలాపురం–2, సిద్దవటం–1, చెన్నూరు–2, ఖాజీపేట–1,నంది మండలం– 1,పెన్నా పేరూరు– 1లలో తొమ్మిది ఆర్‌ఎస్కేలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈనెల 15 నుంచి ప్రభుత్వం మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేస్తామని కలెక్టర్ వివరించారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి