
నకిలీ మద్యం స్కాంపై సీబీఐ విచారణ జరపాలి
మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా
కడప కార్పొరేషన్ : రాష్ట్రంలో జరిగిన నకిలీ మద్యం స్కాంపై సీబీఐతో విచారణ చేయించాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా డిమాండ్ చేశారు. గురువారం కడపలోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మద్యం పేరు చెబితే చంద్రబాబు గుర్తుకు వస్తారని, ఎన్‌టీఆర్ ప్రవేశపెట్టిన మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచిన ఘనత బాబుదేనన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చిందని ఎద్దేవా చేశారు. తంబళ్లపల్లెలోని మొలకల చెరువు, ఇబ్రహీంపట్నంలలో నకిలీ మద్యం గుట్టు రట్టయ్యిందన్నారు. కుటీర పరిశ్రమలుగా తయారీ కేంద్రాలను నడుపుతున్నారని, వీటిలో వందల కోట్ల నకిలీ మద్యం పట్టుబడిందన్నారు. స్పిరిట్‌తో వాటిని తయారు చేస్తున్నారని, నకిలీ మద్యం సరఫరా ద్వారా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. పెదబాబుకు, చినబాబుకు తెలియకుండానే ఇదంతా జరుగుతోందా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. నకిలీ మద్యం స్కాంను వెలుగులోకి తెచ్చిన ఎకై ్సజ్ సీఐ హిమబిందుకు సస్పెన్షన్‌ను బహుమతిగా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఇదేనన్నారు. నకిలీ మద్యంపై ఫేక్ ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు చెప్పడం దారుణమన్నారు. రాష్ట్రంలో అన్ని అరాచకాలు జరుగుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ దాక్కున్నారని, తన ప్యాకేజీ పోతుందనే నోరు మెదపడం లేదా అని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు బంగారు నాగయ్య, నాయకులు బసవరాజు, మునిశేఖర్‌రెడ్డి, గౌస్, కార్పొరేటర్లు షఫీ, అజ్మతుల్లా, కె. బాబు పాల్గొన్నారు.