
ఆల్మట్టిపై చంద్రబాబు మాట్లాడరెందుకు.?
కడప కార్పొరేషన్ : ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచేందుకు కర్నాటక కేబినెట్ తీర్మాణం చేసి, టెండర్లు కూడా పిలుస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మౌనం వహించడం దారుణమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఇక్కడి జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1995లో దేవెగౌడ సర్కార్ అల్మట్టి ఎత్తును 509 నుంచి 524 మీటర్లకు పెంచుతూ పనులు చేపట్టినా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నోరు మెదపకుండా రాష్ట్రానికి అన్యాయం చేశారన్నారు. 1996 లోక్ సభ ఎన్నికల్లో యునైటెడ్ ఫ్రంట్ ఛైర్మెన్‌గా వ్యవహరించిన బాబు, కర్నాటక సీఎం దేవగౌడను ప్రధానిగా చేయడంలో తానే కీలకంగా వ్యవహరించినట్లు చెప్పుకుంటారన్నారు. ఆయన ప్రధాని అయ్యాకే ఆల్మట్టి డ్యామ్‌కు నిధులు మంజూరై పనులు పూర్తయ్యాయన్నారు. ఇలా అప్పట్లో ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోకుండా చంద్రబాబు రాష్ట్రానికి అన్యాయం చేశారన్నారు. తాజాగా ఆల్మట్టి డ్యామ్ నీటి నిల్వ ఎత్తును 509 నుంచి 524 మీటర్లకు పెంచుతూ కేబినెట్ తీర్మాణం చేసిందన్నారు. దీంతో ఆల్మట్టి డ్యామ్ సామర్థ్యం 129.72 నుంచి 270.72 టీఎంసీలకు పెరుగుతుందన్నారు. కర్నాటక చర్యల వల్ల కృష్ణా జలాలు రాష్ట్రానికి వచ్చే పరిస్థితులు ఉండవన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో ఎగువ నుంచి చుక్క నీరు కూడా కిందికి రాదన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లపై ఆధారపడ్డ ప్రాజెక్టుల ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే పోలవరం నుంచి బనకచర్ల క్రాస్ వరకూ అనుసంధానిస్తామని, సోమశిల అనుసంధానం అంటూ ముఖ్యమంత్రి పొంతన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఒకవైపు కర్నాటక, మరోవైపు తెలంగాణ ప్రాజెక్టులు నిర్మించడం వల్ల రాయలసీమ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మొదలు పెడితే పర్యావరణ అనుమతులు లేవనే సాకుతో ఆ పనులు పూర్తి చేయకుండా ఉన్నారన్నారు. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంతో పొత్తులో ఉన్న చంద్రబాబు పర్యావరణ అనుమతులు తీసుకొచ్చి ఈ పనులు పూర్తి చేయలేరా అని ప్రశ్నించారు. జీఎన్‌ఎస్‌ఎస్ నుంచి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ను కలిపే పనులు కూడా పూర్తి చేయలేదన్నారు. 17 ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, రాయలసీమకుగానీ ఇతర ప్రాంతాల అభివృద్ధికిగానీ చేసింది శూన్యమన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్ని వైఎస్సార్, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలు పెంచారన్నారు. నంద్యాల, అన్నమయ్య, తిరుపతి, పుట్టపర్తి జిల్లాలను ఏర్పాటు చేసి, కొప్పర్తి, ఓర్వకల్లు సెజ్ ఏర్పాటు చేసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రాంతానికి మేలు చేశారన్నారు. ఈవెంట్ల పేరుతో వారానికొసారి ఢిల్లీకి, నిత్యం విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంపుపై ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరముందన్నారు. దీనిపై పోరాటం చేసి భవిష్యత్ తరాలకు నష్టం కలగకుండా చూడాల్సిన సమయం వచ్చిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్లలో రూ.3లక్షల కోట్లు అప్పు చేస్తే 17 నెలల్లోనే చంద్రబాబు రూ.2లక్షల కోట్లు అప్పు చేశారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ వివేకా హత్య కేసును పదే పదే ప్రస్తావించారని, అధికారంలోకి వచ్చి 17 నెలలైనా ఆ కేసును ఎందుకు తేల్చలేదని ప్రశ్నించారు. లిక్కర్ స్కాంలో ఆధారాలు దొరకలేదని, కోర్టులో ఈ కేసు వీగిపోయే అవకాశం ఉందన్నారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచకుండా ప్రభుత్వం అడ్డుకోవాలని, టెండర్లు వెనక్కి తీసుకునేలా పలుకుబడిని ఉపయోగించాలని సూచించారు. భవిష్యత్‌లో శ్రీశైలంపై ఏ ప్రాజెక్టు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ పులి సునీల్ కుమార్, వేర్‌హౌస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎస్‌ఏ కరిముల్లా, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు షఫీవుల్లా, వలంటీర్స్ విభాగం అధ్యక్షుడు ఫయాజ్ పాల్గొన్నారు.
ప్రాజెక్టు ఎత్తు పెంచితే
రాయలసీమ ఎడారే
గతంలో ఆల్మట్టి ఎత్తు పెంచినా
నోరు మెదపని బాబు
ఇప్పుడు ఎన్‌డీఏతో పొత్తులో ఉన్నా అడ్డుకోకపోవడం అన్యాయం
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి