
మెప్మా.. ఇదేంటి చెప్మా
పీఎం సూర్యఘర్ అంటే..
కడప కార్పొరేషన్: ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం మాటున ఓ ప్రైవేటు సంస్థ, కొంతమంది అధికారులు అక్రమార్జన కోసం అడ్డదారులు వెతుకుతున్నారు. జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొంది సుమారు 20 సోలార్ రూఫ్ టాప్ అమర్చే ఏజెన్సీలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ కాదని ఎక్కడో గుంటూరుకు చెందిన ఆంధ్ర ఎంటర్‌ప్రైజెస్ అనే సంస్థ ద్వారానే సోలార్ రూఫ్ టాప్ అమర్చుకునేలా విద్యుత్ వినియోగదారులను ఒప్పించాలని లక్ష్యాలు విధించడం హాట్ టాపిక్‌గా మారింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)లో స్వయం సహాయ సంఘాలకు రిసోర్స్ పర్సన్లుగా వ్యవహరించే వారికి టార్గెట్లు విధించారు. ఒక్కో ఆర్‌పీ వంద కనెక్షన్లు చేయించాలని ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. సోలార్ రూఫ్ టాప్‌లు అమర్చుకునేలా ప్రజలకు విస్తృత అవగాహన తీసుకురావాలని గతంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సమావేశాలకు బ్యాంకర్లను కూడా పిలిపించి రుణాల మంజూరుకు హామీ ఇప్పించారు. కానీ కొద్దిమంది మాత్రమే ఆ దిశగా మొగ్గుచూపారు. ఇప్పుడు ఆర్‌పీల వంతు వచ్చింది. ఎలాగైనా సరే విద్యుత్ వినియోగదారులను ఒప్పించి సోలార్ రూఫ్‌టాప్ అమర్చేలా చేయాలని మెప్మా అఽధికారులు ఒత్తిడి తెస్తుండటంతో ఆర్‌పీలు లోలోన మథనపడిపోతున్నారు.
ఒకే ఒక్క ఏజెన్సీనే ఎందుకు...?
జిల్లాలో సుమారు 30 ఏజెన్సీలు ఉండగా ఒక్క ఆంఽధ్ర ఎంటర్‌ప్రైజెస్‌కు మాత్రమే లబ్ది చేకూర్చేందుకు మెప్మా అధికారులు టార్గెట్లు విధించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ కంపెనీ ప్రతినిధులతో మెప్మా అధికారులు కుమ్మకై ్క తమపై ఒత్తిడి తెస్తున్నారని ఆర్‌పీలు వాపోతున్నారు. ఆర్‌పీల సమావేశంలో కంపెనీ ప్రతినిధులను కూర్చొబెట్టి వంద కనెక్షన్లు చేయాలని నిర్దేశిస్తున్నట్లు తెలుస్తోంది. లేదంటే సెలవుపై వెళ్లాలని బెదిరిస్తున్నారని సమాచారం. కడపలో 210 ముంది ఆర్పీలు పనిచేస్తున్నారు. ఒక్కొక్కరికి వంద చొప్పన అంటే 20వేల కనెక్షన్లు చేయాలని టార్గెట్ ఇచ్చి మరీ బెదిరించడం విమర్శలకు తావిస్తోంది. టార్గెట్లు పూర్తి చేస్తే కమీసన్లు ఇస్తామని ప్రలోభాలకు కూడా గురిచేస్తున్నట్లు తెలిసింది. సోలార్ రూఫ్ టాప్ గురించి విస్తృత అవగాహన కల్పించడంలో ఎలాంటి తప్పులేదు కానీ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల ఫోటోలతో కరపత్రాలు ప్రచురించడం, ప్రభుత్వమే ఆ కంపెనీని ప్రోత్సహిస్తునట్లు మభ్యపెడుతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్ర ఎంటర్‌ప్రైజెస్ ద్వారానే సూర్యఫలకలు అమర్చేలా మెప్మా అధికారులు అత్యుత్సాహం చూపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇళ్లపై సూర్య ఫలకలు అమర్చిన ఏ ఏజెన్సీ అయినా ఐదేళ్లపాటు సర్వీసు అందించాల్సి ఉంటుంది. స్థానికంగా ఉన్న ఏజెన్సీలు, వెండార్స్ అయితే కొంత మేరకై నా జవాబుదారీగా ఉండే అవకాశముంది. గుంటూరులో ఉండే ఈ ఆంధ్ర ఎంటర్‌ప్రైజెస్ ఏ మేరకు సర్వీసు అందిస్తున్నది ప్రశ్నార్థకంగా మారింది. వారు నాసికరం సూర్య ఫలకలు అమర్చి భవిష్యత్‌లో ఏవైనా సమస్యలు వస్తే వినియోగదారులు ఎవరిని అడగాలి, ఒప్పించి కనెక్షన్లు ఇప్పించిన మెప్మా అధికారులనా...ఆర్‌పీలనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
నివాస గృహాల రూఫ్‌పై సోలార్ ఫలకలు ఏర్పాటు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం రూ.78వేల వరకూ సబ్సిడీ ఇస్తుంది. లబ్ధిదారులు వెండార్స్‌ను ఎన్నుకొని వారి ద్వారా సోలార్ ఫలకలను అమర్చుకోవచ్చు. అలాగే బ్యాంకు లోన్ పొంది సబ్సిడీ పోను మిగిలిన మొత్తాన్ని ఈఎంఐల రూపంలో చెల్లించవచ్చు. ప్రతినెలా కరెంటు బిల్లుకు చెల్లించే మొత్తాన్ని ఈఎంఐ కడితే కొంత కాలానికి సోలార్ ద్వారా ఉచిత విద్యుత్ లభిస్తుంది. మొత్తంగా పీఎం సూర్యఘర్ పథకం ముఖ్య ఉద్దేశ్యం ఇది.
పీఎం సూర్య ఘర్ ఒక సంస్థకే
డ్వాక్రా ఆర్పీలకు అధికారుల టార్గెట్లు
ఆందోళనలో రిసోర్స్ పర్సన్లు