వాసూ..నీ తీరు బాగోలేదు ! | - | Sakshi
Sakshi News home page

వాసూ..నీ తీరు బాగోలేదు !

Oct 2 2025 8:26 AM | Updated on Oct 2 2025 8:26 AM

వాసూ..నీ తీరు బాగోలేదు !

వాసూ..నీ తీరు బాగోలేదు !

నిన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి

సన్నిధి నుంచి అసమ్మతి గళం

ఇప్పుడు పెద్ద దర్గా నుంచి ముస్లిం మైనార్టీ నేతల తిరుగుబాటు

తరువాత ఎదురుతిరిగేది ఎవరో..?

టీడీజీ జిల్లా అధ్యక్షుడు వాసుపై

తమ్ముళ్ల పోరు బావుటా..!

కడప రూరల్‌ : జిల్లా తెలుగుదేశం పార్టీలో ఐక్యత కలగా మారింది. ప్రతి నియోజకవర్గంలో వర్గ పోరు..అసమ్మతి సెగలు ఎగిసిపడుతున్నాయి. కాగా అన్ని నియోజక వర్గాలు ఒక ఎత్తయితే కడప నియోజకవర్గం ప్రత్యేకంగా మారింది. అధిష్టానానికి తల నొప్పిగా తయారైంది. ఇక్కడ నిత్యం ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇటీవల ఆ పార్టీకి చెందిన నాయకుడు పాత కడప క్రిష్ణారెడ్డి తిరుమల తొలి గడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి సన్నిధి నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డెప్పగారి శ్రీనివాసులురెడ్డిపై బహిరంగంగానే తిరుగుబాటు ప్రకటించారు. అంతేకాదు తమకు అండగా, పెద్ద దిక్కుగా ఉండాలని కోరుతూ పెద్ద సంఖ్యలో కార్యక్తలతో వాహనాల్లో కమలాపురం వెళ్లి ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డిని కలవడం పెద్ద దుమారమే లేపింది.

ముస్లిం మైనార్టీ నేతల మండిపాటు...

ఈ నేపథ్యంలో కడప నియోజకవర్గంలో కీలకంగా ఉన్న ముస్లిం మైనార్టీ నేతలు పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీరుపై మండిపడుతున్నారు. టీడీపీ కోసం పనిచేస్తున్న సీనియర్‌ నాయకులను కాదని పార్టీ ఫిరాయింపుదారులకు, తన అనుచరులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం పట్ల తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల ఏర్పాటు చేపిన ఆ పార్టీ నూతన కడప నగర కమిటీని పార్టీ కార్యకర్తలు తిరస్కరించారు. అయితే పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డి, కార్యకర్తల అభిప్రాయాలను ఏ మాత్రం లెక్క చేయకుండా ఏకపక్షంగా కమిటీని నియమించారని కార్యకర్తలు బహిరంగంగానే ఆరోపించారు. అనంతరం విలేకరుల సమావేశంలో శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ‘సీనియర్లు లేదు..తోలు తొక్కలేదు. టీడీపీ అంటే రెడ్డెప్పగారి కుటుంబమే’ అని వ్యాఖ్యానించడంతో తమ్ముళ్లలో మరింతగా ఆగ్రహావేశాలు నింపాయి. ఈ తరుణంలో ముస్లిం మైనార్టీ నేతలు పార్టీలో తమ వర్గానికి ఎలాంటి గుర్తింపు, ప్రాధాన్యత లేకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీనియర్‌ నాయకుడు అమీర్‌బాబును వచ్చే కార్పొరేషన్‌ ఎన్నికల్లో మేయర్‌ అభ్యర్ధిగా ప్రకటించాలనే వాదన తెరపైకి తెచ్చారు. అలాగే పలు అంశాలకు సంబంధించి ఇటీవలనే ఒక డివిజన్‌లోని పార్టీకి చెందిన ముస్లిం మైనార్టీ నాయకుడి నివాసంలో, ఆ పార్టీకి చెందిన ముస్లిం మైనార్టీ కార్యకర్తలంతా సమావేశమయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా అందరూ ఒకే తాటిపైకి వచ్చారు. ఆ మేరకు ఈ నెల 20వ తేదీ లేదా మరెప్పుడైనా సరే పెద్ద దర్గాలో ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించి, కడప నగరంలోని 20 డివిజన్లలోని పార్టీకి చెందిన సీనియర్‌ కార్యకర్తలతో 20కిపైగా వాహనాల్లో కమలాపురం వెళ్లి, ఆ పార్టీ నేత పుత్తా నరసింహారెడ్డిని కలిసి ‘పెద్దాయనా’ నీవే మాకు దిక్కు, సీనియర్లకు న్యాయం జరిగేలా చూడాలని కోరనున్నట్లు సమాచారం. ముస్లిం మైనార్టీల తరువాత మరొక సామాజిక వర్గానికి చెందిన నేతలు సైతం అసమ్మతి జెండాను ఎగురవేయనున్నట్లు తమ్ముళ్లు చెబుతున్నారు. వాసూ..నీ తీరు ఏ మాత్రం బాగోలేదని ఆ పార్టీ శ్రేణులు బహిరంగంగానే చెబుతున్నాయి. రోజుకో అసమ్మతి రాగంతో కడప టీడీపీలో గంగరగోళం ఏర్పడింది. రేపేమి జరుగుతుందో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement