
ఐచర్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి
లింగాల : లింగాల మండలం ఇప్పట్ల గ్రామ సమీపంలోని సంచుల ఫ్యాక్టరీ వద్ద చీనీ కాయల లోడుతో వెళుతున్న ఐచర్ వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అనంతపురం జిల్లా యల్లనూరు మండలం సింగవరం గ్రామానికి చెందిన జయప్ప(58) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఐచర్ వాహనం లింగాల నుంచి చీనీ కాయల లోడుతో పులివెందులకు వస్తుండగా సంచుల ఫ్యాక్టరీ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో జయప్ప తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్‌ఐ రాజు తెలిపారు.
నిలిచి ఉన్న లారీని ఢీకొన్న మరో లారీ
ముద్దనూరు : ముద్దనూరు–తాడిపత్రి జాతీయ రహదారిపై మండలంలోని యామవరం గ్రామ సమీపంలో మరమ్మతులకోసం నిలిచివున్న లారీని వెనుకనుంచి వచ్చిన మరో లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. బుధవారం తెల్లవారుజామున ఐరన్‌మట్టి లోడుతో ప్రయాణిస్తున్న లారీ ముందువైపు బూడిద లోడుతో నిలబడివున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో వెనుకవైపు ఉన్న లారీలో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టి అతన్ని బయటకు తీశారు. బాధితుడికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
అదనపు కట్నం కోసం
వేధింపులపై కేసు
ముద్దనూరు : అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని భర్తతో పాటు మరో ముగ్గురిపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు .ఏఎస్‌ఐ రమేష్ సమాచారం మేరకు మండలంలోని కోనాపురం గ్రామానికి చెందిన వాసంతి అనే మహిళకు ఏడేళ్ల క్రితం ఎర్రగుంట్ల మండలం హనుమనగుత్తి గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డితో వివాహమైంది. వివాహమైన కొద్ది సంవత్సరాల నుంచి అదనపు కట్నం తేవాలని భర్తతో పాటు అత్తమామలు, బావ కొండారెడ్డిలు తనను వేధిస్తున్నారని వాసంతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నలుగురిపై వర కట్న వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
బైక్‌లు అదుపుతప్పి
ఇద్దరికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : వేర్వేరు ప్రమాదాల్లో బైక్‌లు అదుపు తప్పి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మదనపల్లె పట్టణం అనపగుట్టకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి(40) బుధవారం బోయకొండకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తుండగా, కొండ దిగేటప్పుడు బైక్ అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించగా, అత్యవసర విభాగంలో చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. అదేవిధంగా బోయకొండకు చెందిన సునీల్(25) ద్విచక్రవాహనంలో మదనపల్లెకు బయలుదేరాడు. బోయకొండ సమీపంలోనే వేగంగా వెళుతూ వాహనాన్ని అదుపుచేయలేక కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఐచర్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి