
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి కృతజ్ఞతలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ, శానిటేషన్, కార్మికులకు రూ.18,600 వేతనం చెల్లించే విషయంలో స్పందించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం, పోరుమామిళ్ల, జమ్మలమడుగు, బద్వేలు, కడప, జీజీహెచ్ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సెక్యూరిటీ, శానిటేషన్ కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. వీరికి కొత్త అగ్రిమెంట్ ప్రకారం రూ.18600 ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ. 11 వేల నుంచి రూ. 12వేలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని ఎంపీకి విన్నవించామన్నారు. ఆయన ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో కాంట్రాక్టర్‌లో చలనం వచ్చిందన్నారు. ఆప్కాస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటసుబ్బయ్య, జిల్లా అధ్యక్షుడు పవన్, సీఐటీయూ నగర అధ్యక్షుడు చంద్రారెడ్డి పాల్గొన్నారు.