
జరిమానా విధిస్తారా? మాఫీ చేస్తారా!
జమ్మలమడుగు : జాతీయ రహదారి నిర్మాణం చేపడుతున్న ఎస్‌ఆర్‌సీ కన్‌స్ట్రక్షన్ కంపెనీ రహదారి నిర్మాణం కోసం రెవెన్యూ శాఖ, మైనింగ్ అధికారుల అనుమతులు లేకుండానే భారీగా కొండను తవ్వి గ్రావెల్‌ను తరలించారు. ఈ విషయం సాక్షి దినపత్రికలో రావడంతో మైనింగ్‌శాఖ అధికారుల్లో కాస్త చలనం వచ్చింది. ఈనెల 10 వతేదీ జమ్మలమడుగు–ముద్దనూరు రహదారి అంబవరం పంచాయతీ పరిధిలో అక్రమంగా కొండను తవ్వి గ్రావెల్‌ను ఎత్తుకు వెళ్లిన ప్రాంతాన్ని అధికారులు సందర్శించారు. అనంతరం అక్రమంగా ఎంత మైనింగ్ చేశారో కొలతలు తీసుకున్నారు. వచ్చిన అధికారులు అక్రమ మైనింగ్‌పై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని ఆ తర్వాత వారు చర్యలు తీసుకోవడంతోపాటు జరిమానాలు విధిస్తారని చెప్పి వెళ్లిపోయారు.
22 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం..
నంద్యాల–జమ్మలమడుగు 167వ జాతీయ రహదారి నిర్మాణం కోసం టెండర్ 80 కిలోమీటర్ల మేర పనులు చేపట్టాల్సి ఉంది. అందులో జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలో 22 కిలోమీటర్ల మేర పనులు చేయడంతోపాటు, పెన్నానదిపై బ్రిడ్జి నిర్మాణం చేయాల్సి ఉంది. ఈ పనులను దక్కించుకున్న ఎస్‌ఆర్‌సీ కంపెనీ గత మూడు నెలలుగా పనులు ప్రారంభించింది. రోడ్డు పనుల కోసం కావలసిన గ్రావెల్ కోసం రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేశారు. అయితే ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఇప్పటికే దాదాపు సగానికి పైగా పనులు పూర్తి చేశారు. మరో రెండు నెలల్లో పనులు పూర్తి చేస్తామని ఎస్‌ఆర్‌సీ కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. రహదారి నిర్మాణం కోసం కావలసిన గ్రావెల్‌ను కాంట్రాక్టర్ ఎలాంటి అనుమతులు లేకుండా మొత్తం కొండను తవ్వి రహదారి నిర్మాణం చేశారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా రోజుకు రెండు వందల టిప్పర్ల వంతున అక్రమంగా గ్రావెల్‌ను తీసుకు వెళ్లారు. ఇదంతా
స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులకు తెలిసినా అటువైపు తొంగి చూడని పరిస్థితి ఉంది. అధికారులు దాడులు చేసి అక్రమంగా తవ్విన గ్రావెల్ కొలతలు తీసుకుపోయిన మరుసటిరోజు నుంచే తిరిగి యథావిధిగా అక్రమ మైనింగ్ చేసి టిప్పర్‌లలో గ్రావెల్‌ను తరలిస్తున్నారు.
చర్యలు తీసుకుంటారా.. ఉసూరు మంటారా!
ఎస్‌ఆర్‌సీ కంపెనీ అక్రమంగా గ్రావెల్ తవ్విన ప్రాంతాల్లో మైనింగ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆపై ఎంత మైనింగ్ ద్వారా గ్రావెల్ తరలించారో కొలతలు తీసుకున్నారు. స్థానికంగా రెవెన్యూ అధికారులు ఎవ్వరూ సహకరించకపోయినా వారే కొలతలు వేసుకుని పోయారు. ప్రస్తుతం 15 రోజులకు పైగా అవుతున్న ఎస్‌ఆర్‌సీ కంపెనీపై ఎలాంటి చర్యలకు సిఫారసుగాని, అక్రమ మైనింగ్ చేసి గ్రావెల్‌ను తరలించినందుకు జరిమానాలు కానీ విధించలేదు. భారీ స్థాయిలో అక్రమంగా గ్రావెల్‌ను తరలించినా ఉన్నతాధికారులు ఏమాత్రం స్పందించకపోవడం కేవలం వచ్చాము.. పోయాము అన్న చందంగా వ్యవహరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎస్‌ఆర్‌సీ అక్రమ తవ్వకాలపై మీనమేషాలు లెక్కిస్తున్న మైనింగ్‌శాఖ