● ఒకరి మృతి, మరొకరికి గాయాలు
● గువ్వలచెరువు ఘాట్‌లో దుర్ఘటన
చింతకొమ్మదిన్నె : చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని గువ్వల చెరువు ఘాట్ జాతీయ రహదారిపై రాయచోటి వైపు నుంచి అతివేగంతో దూసుకొచ్చిన లారీ ఎదురుగా వస్తున్న ద్విచక్రవహనాన్ని ఢీకొనడంతో కొప్పల లక్షుమయ్య (60) మృతి చెందాడు. కొప్పల. ఈశ్వరయ్య అనే వ్యక్తికి గాయాలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం రాయచోటి వైపు నుంచి ఎలక్ట్రికల్ పరికరాలతో కూడిన గూడ్స్ లారీ వేగంగా రావడంతో నాలుగో మలుపు సమీపంలోని స్పీడ్ బ్రేకర్ల వద్ద లారీని డ్రైవర్ అదుపుచేయలేక లారీ డ్రైవర్ కిందికి దూకేశాడు. ఆ సమయంలో రోడ్డుకు అవతలవైపున ఎదురుగా గువ్వలచెరువు వెపు వెళ్తున్న ద్విచక్రవాహనదారుడు ఈశ్వరయ్య గమనించి ద్విచక్రవాహనాన్ని ఆపే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంలో ప్రయాణిస్తున్న కొప్పల లక్షుమయ్యను లోయవైపు ఈడ్చుకుపోగా కుడి కాలు, కుడి చేయి తెగి పడి, సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. ద్విచక్రవాహనంలోని మరో వ్యక్తి కొప్పల ఈశ్వరయ్యకు గాయలయ్యాయి. లారీ డ్రైవర్ లారీ లోయ వైపు దూసుకెళ్లే క్రమంలో లారీ నుండి ముందే దూకి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. గాయపడినవారిని పోలీసులు 108 వాహనాల ద్వారా కడప రిమ్స్‌కు తరలించారు. ప్రమాదంలో మృతిచెందిన లక్షమయ్య, గాయపడిన ఈశ్వరయ్య సమీప బంధువులే. వీరిది లక్కిరెడ్డిపల్లె మండలంలోని దప్పేపల్లె రామాపురం గ్రామం. కడపలో ఉన్న తమ సమీప బంధువుల ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ప్రమాదం బారిన పడ్డారు. మృతుని బంధువులు సంఘటన స్థలం వద్దకు చేరుకొని తీవ్రంగా విలపించారు. సంఘటన స్థలాన్ని చింతకొమ్మదిన్నె సీఐ బాల మద్దిలేటి, సిబ్బంది పరిశీలించారు.
మృత్యువులా దూసుకొచ్చిన లారీ