
రైతన్నా.. జర జాగ్రత్తన్నా..!
● పురుగుమందు పిచికారీలో అప్రమత్తత అవసరం
● అజాగ్రత్తగా ఉంటే ప్రాణాలకే ముప్పు
వర్షాలు విస్తారంగా కురవడంతో వరి, ఆరుతడి పంటలకు తెగుళ్లు విజృంభించే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో పురుగుమందు పిచికారీ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇక్కడే రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. రసాయన మందుల వాడకం తగ్గించాలని, పిచికారీ చేసేటపుడు కనీస జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.
కడప అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా వరి 18 వేల హెక్టార్లు, జొన్న, సజ్జ, మినుము, వేరుశనగ, పత్తి తదితర పంటలు మరో 5వేల హెక్టార్లలోనూ రైతులు సాగు చేశారు. ఇపుడు వర్షాలు కురవడంతో మరింతమంది రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. పెన్నా, కుందూ నదీ పరివాహక ప్రాంతాలతోపాటు ప్రాజెక్టులు, కేసీ కెనాల్, బోర్ల కింద వరి సాగు విస్తారంగా సాగుతోంది. ముందస్తుగా సాగు చేసిన పంటలకు ప్రస్తుతం తెగుళ్లు సోకుతున్నట్లు రైతులు చెబుతున్నారు. పంటలను ఆశించే చీడపీడల నివారణ కోసం విస్తృతంగా క్రిమి సంహారక మందులను పిచికారీ చేస్తున్నారు.
అప్రతమత్తంగా ఉండాల్సిందే
రైతులు పురుగు మందులు వ్యవసాయశాఖ ద్వారా గుర్తింపు పొందిన ఎరువుల దుకాణాల్లో మాత్రమే కొనుగోలు చేయాలని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. మందు డబ్బాలపై వజ్రాకారంలో పురుగు మందుల స్థాయిని తెలిపే రంగులను గుర్తించాలి. అత్యంత విషపూరితమైతే నీలం, తక్కువ విషపూరితమైతే ఆకుపచ్చ రంగలు ఉంటాయి. పురుగు మందులు అవసరానికి మించి కొనుగోలు చేయరాదు. పురుగు మందులు ముందుగా కొని ఇల్లు, పొలాల వద్ద నిల్వ చేయరాదు.
పిచికారీలో జాగ్రత్త..
రైతులు పురుగు మందులు పిచికారీ చేసే సమయంలో జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. పిచికారీ చేసే సమయంలో శరీరాన్ని కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. ముఖానికి మాస్కు, చేతులకు గ్లౌజులు వేసుకోవాలి. పిచికారీ సమయంలో భోజనం చేయడం, నీరు తాగడం, సిగిరెట్, బీడీ కాల్చడం వంటి పనులు చేయరాదు. మందులు కలిపేటప్పుడు కర్రలతో కలపడం శ్రేయస్కరం. ఇళ్లలో పిల్లలకు అందకుండా మందు డబ్బాలు జాగ్రత్తగా ఉంచాలి. మందు డబ్బాలపై కరపత్రాన్ని చదవాలి. రంగులు గుర్తించి ద్రావణం జాగ్రత్తగా పిచికారీ చేయాలి. నాజిల్స్‌ను నోటితో గాలి ఊది శుభ్రం చేయడం అత్యంత ప్రమాదకరం. ఖాళీ డబ్బాలను గొయ్యి తీసి పూడ్చిపెట్టాలి. పిచికారీ అయిన వెంటనే స్నానం చేసి దుస్తులను శుభ్రపరచుకోవాలి. మందు ప్రభావానికి గురైతే వైద్యులను సంప్రదించాలి. పై జాగ్రత్తలు పాటించకపోతే గుండె జబ్జు, కళ్లు తిరగడం, వాంతులు, క్యాన్సర్, నరాల బలహీనత వంటి సమస్యలకు లోనయ్యే ప్రమాదం ఉంటుందని నిపుణులు తెలిపారు.
ప్రకృతి వ్యవసాయం మేలు
ప్రకృతి వ్యవసాయ సాగు విధానాన్ని అనుసరిస్తే రైతులతోపాటు నేల ఆరోగ్యంగా ఉంటుంది. తక్కువ ెపెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే అవకాశం కలుగుతుంది. ఆరోగ్యకర పంట ఉత్పత్తులు పొందడమేగాక, పెట్టుబడి వ్యయం సగానికిపైగా తగ్గుతుంది. పశువుల పేడ, వేపాకు కషాయం, పచ్చిరొట్ట ఎరువులు, వర్మికంపోస్టు వినియోగిస్తే భూసారం పెరుగుతుంది, విచక్షణా రహి తంగా పురుగు మందులు వినియోగిస్తే పంటకు నష్టం వాటిల్లుతుంది.
శాస్త్రవేత్తలు, అధికారుల
సూచనలు పాటించాలి
పంట పొలాల్లో చీడ, పీడల నివారణకు శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారుల సూచనలు తీసుకోవాలి. నాణ్యమైన పురుగు మందులను మాత్రమే వాడుకోవాలి. మందు పిచికారీ చేసేటప్పుడు రక్షణ దుస్తులు, గ్లౌజులు ధరించాలి. జాగ్రత్తగా పురుగుమందులను పిచికారీ చేసుకోవాలి.
– చంద్రా నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి

రైతన్నా.. జర జాగ్రత్తన్నా..!

రైతన్నా.. జర జాగ్రత్తన్నా..!