
హామీలను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం
బద్వేలు అర్బన్ : ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసిందని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్.ప్రసాద్ అన్నారు. యూటీఎఫ్ రణభేరి రాష్ట్రవ్యాప్త ప్రచార జాత శుక్రవారం బద్వేల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక భాకరాపేట నుంచి నాలుగు రోడ్ల కూడలి మీదుగా జెడ్పీ హైస్కూల్ వరకు సీఐటీయూ, డీవైఎఫ్‌ఐ, ఐద్వా సంఘాల నాయకులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగుల అండదండలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పాలన సాగిస్తోందన్నారు. విలీనం పేరుతో వేలాది పాఠశాలలను మూసివేసి, ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మార్చివేసిందని అన్నారు. ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు పక్షపాతిగా ఉంటామని, ఉద్యోగులకు మెరుగైన వేతనాలు అమలు చేస్తామని హామీలు గుప్పించి 15 నెలల కాలంలో వారిని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఈ నెల 25వ తేదీన చలో విజయవాడ, భారీ బహిరంగ సభ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు కె.సురేష్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శులు లక్ష్మీరాజా, జయచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదనవిజయకుమార్, పాలెంమహేష్‌బాబు, శ్రీనివాసులు, చిన్ని, నాగార్జునరెడ్డి, సుజాతరాణి, సివి.రమణ, శివప్రసాద్, ఎజాస్‌అహ్మద్, రవీంద్రుడు, మురళీకృష్ణ, సుబ్బారావు పాల్గొన్నారు.