
ప్రభుత్వ కార్యక్రమాలకు కొండారెడ్డి ఎలా హాజరవుతారు?
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నంద్యాల వరదరాజులరెడ్డి ఉన్నారా.. లేక ఆయన కుమారుడు కొండారెడ్డి అనధికారిక ఎమ్మెల్యేగా ఉన్నారా అంటూ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి ఎద్దేవా చేశారు. తన స్వగృహంలో విలేకరులతో శుక్రవారం ఆయన మాట్లాడుతూ కొండారెడ్డిని ప్రజలు ఓట్లేసి ప్రజలు గెలిపించారా అని ప్రశ్నించారు. అధికార పూర్వకంగా వరదరాజులరెడ్డి ఎమ్మెల్యేగా ఉండాల్సి ఉండగా, రాజ్యాంగానికి విఘాతం కలిగిస్తూ వరద కుమారుడు కొండారెడ్డి కార్యక్రమాలు నిర్వహించడం చూసి ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్లడం, రిబ్బన్ కట్ చేయడం, రికార్డులను పరిశీలించడం ఏమిటంటూ ఆయన ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత తాను హైదరాబాద్‌కు వెళ్లి వ్యాపారం చేసుకుంటానని చెప్పిన కొండారెడ్డి ఇపుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కొండారెడ్డిపై దేశ ద్రోహం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపాలన్నారు. ప్రజలకు సేవ చేయాల్సిన వరదరాజులరెడ్డి దూరంగా ఉన్నారని, ఆయన కుమారుడు కొండారెడ్డి ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి హాజరవుతున్నారని ఆరోపించారు. ప్రజా సామ్యాన్ని అపహాస్యం చేస్తున్న అధికారులను గుర్తుపెట్టుకునేందుకు తాను బ్యాడ్ మెమోరీస్ రాస్తున్నానని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అలాంటి అధికారులను వదిలిబెట్టబోనన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సూపరింటెండెంట్ రూపాందన్ ఆహ్వానం మేరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమానికి హాజరైన కొండారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారన్నారు. ఈ విషయంపై నేషనల్ హెల్త్ మిషన్ ప్రాజెక్టు జాయింట్ సెక్రటరీ కిరణ్‌గోపాల్ వాస్కోకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. తాత్కాలిక కూరగాయల మార్కెట్ సందర్శించడం... కమిషనర్‌తోపాటు అధికారులంతా వెళ్లడం చూస్తే ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రజా ప్రతినిధి కానీ కొండారెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎలా పంపిణీ చేశారన్నారు. పోలీసు అధికారులు సైతం కొండారెడ్డికి సెల్యూట్ చేసి పుష్పగుచ్ఛాలు ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లేనిపోని ఆరోపణలు చేసిన ఉక్క ప్రవీణ్ ఇప్పుడు ఏమి చేస్తున్నారని రాచమల్లు ప్రశ్నించారు. వరదరాజులరెడ్డితోపాటు కొండారెడ్డి, రాఘవరెడ్డి, హరినాథరెడ్డి, భార్గవరెడ్డి దోచుకో.. దాచుకో అన్నట్లుగా తయారయ్యారన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, ఎంపీపీ సానబోయిన శేఖర్ యాదవ్, మార్తల ఓబుళరెడ్డి, జంగమయ్య, రాగుల శాంతి, లావణ్య, సత్యం, అనిల్, భూమిరెడ్డి వంశీధర్‌రెడ్డి, ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, గరిశపాటి లక్ష్మీదేవి, ఆంజనేయులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి