– జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్
ప్రొద్దుటూరు క్రైం : దసరా ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అన్నారు. ప్రొద్దుటూరు డీఎస్పీ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. డీఎస్పీ భావనతో కలిసి సబ్‌డివిజన్‌లోని సీఐలు, ఎస్‌ఐలతో సమావేశమై స్టేషన్ల వారీగా పరిస్థితులు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో ఎస్పీ మాట్లాడుతూ ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్, మట్కాలను రూపుమాపుతామని, అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. మహిళల రక్షణకు అ న్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. విజయవాడ తర్వాత ప్రొద్దుటూరులో అత్యంత వైభవంగా దసరా ఉత్సవాలు నిర్వహిస్తారని, లక్షలాది భక్తులు వస్తున్నందున భద్రతాపరమైన చర్యల గురించి డీఎస్పీ, సీఐలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఆలయకమిటీ నిర్వాహకులు, రెవెన్యూ, ఫైర్, విద్యుత్ తదితర శాఖలను సమన్వయం చేసుకొని ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఎస్పీ స్థానిక వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయాన్ని దర్శించుకున్నారు. దసరా ఉత్సవకమిటీ అధ్యక్షుడు బుశెట్టి రామ్మోహన్‌రావు దసరా ఉత్సవాల తీరును ఎస్పీకి వివరించారు. ఎస్పీ వెంట డీఎస్పీ భావన, సీఐలు తిమ్మారెడ్డి, సదాశివయ్య, వేణుగోపాల్, నాగభూషణం, రాజగోపాల్, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
ఓటరు జాబితాలో
అక్రమాలను నిరోధించాలి
బద్వేలు అర్బన్ : దేశ వ్యాప్తంగా ఓటరు జాబితాలో జరిగే అక్రమాలను నిరోధించాలని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు నిర్వహిస్తున్న ఓట్ చోర్ – గద్దీ చోడ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షురాలు ఎన్‌డీ.విజయజ్యోతి కోరారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కార్యక్రమంలో భాగంగా లక్ష సంతకాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రజలంతా చైతన్యవంతులు కావాలని కోరారు. ఈ సమావేశంలో అచ్యుతరాజు, చిన్నరామిరెడ్డి, నరసింహ, సుధాకర్‌రెడ్డి, పుల్లూరు బాషా, ఖాజావలి, సాంబయ్య, గురప్ప, బాలసుబ్బయ్య, శేఖర్‌రెడ్డి, నాయబ్‌రసూల్ తదితరులు పాల్గొన్నారు.
వైవీయూ పీజీ ఫలితాలు విడుదల
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం ఎమ్మెస్సీ, ఎంఏ రెండో సెమిస్టర్, లేటరల్ ఎంట్రీ థర్డ్ సెమిస్టర్, ఫైన్ ఆర్ట్స్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ డిప్లమా కోర్సుల పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఆయన తన చాంబర్‌లో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.పద్మ, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ టి.శ్రీనివాస్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ కేఎస్వీ కృష్ణారావుతో కలిసి పీజీ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఎంఏ, ఎంఎస్సీ కోర్సుల్లో ఎక్కువ బ్రాంచ్ లు వంద శాతం ఫలితాలు సొంతం చేసుకున్నాయన్నారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించారు.
ఉల్లి మార్కెటింగ్‌పై ప్రత్యేక దృష్టి
– కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలో పండించిన ఉల్లి పంటను రైతులకు నష్టం వాటిల్లకుండా మార్కెటింగ్ చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతోందని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో కలెక్టర్ జేసీ అదితి సింగ్‌తో కలిసి ప్రభుత్వం చేపడుతున్న ఉల్లి పంట కొనుగోలుకు సంబంధించి జిల్లాలోని ఉల్లి ట్రేడర్లతో సమావేశం ఏర్పాటు చేసి, ప్రస్తుత రైతుల పరిస్థితి దృష్ట్యా ఉల్లి కొనుగోలుపై వారికి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న రైతుల నుంచి అధిక లాభాలను ఆశించ రాదని జిల్లాలోని ఉల్లి ట్రెడర్లకు సూచించారు. రైతులు, వ్యాపారస్తులు.. ప్రభుత్వంతో సమన్వయంగా మార్కెటింగ్ చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో ఉల్లి నిల్వకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు అందించాలని మార్క్‌ఫెడ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాలో రైతులు పండించిన ఉల్లి పంటను మార్కెటింగ్ చేయడంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు ఎలాంటి చర్యలను అవలంబిస్తే అనుకూలంగా ఉంటుంది? అనే అంశంపై చర్చించడం జరిగింది. ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక ప్రకారం చర్యలు చేపడుతోందని వివరించారు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఇంకా ఉల్లి పంట కోతకు సిద్ధంగా ఉందని, ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంట దిగుబడిని ఎలా సంరక్షించుకోవాలి? ఒక్కసారిగా అధిక పంట యార్డులకు చేరితే దాన్ని ఎలా మార్కెటింగ్ చేయాలి? అనే అంశాలను రైతులు, ట్రేడర్లతో చర్చించి.. ఉల్లి రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, నాణ్యతను పరిగణనలోకి తీసుకుని ఈ కొనుగోలు ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా, పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవిచంద్ర బాబు, జిల్లా మార్క్‌ఫెడ్ అధికారి పరిమళ జ్యోతి, మార్కెటింగ్ ఏడీ ఆజాద్ వలి తదితరులు పాల్గొన్నారు.
దసరా ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహిస్తాం
దసరా ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహిస్తాం