
21న పుష్పగిరిలో ఉచిత సామూహిక పిండ ప్రదానం
వల్లూరు : పుష్పగిరిలోని లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయం సమీపంలో పవిత్ర పెన్నానది ఒడ్డున గల రుద్ర పాద ఆలయం వద్ద పితృదేవతలకు ఉచిత సామూహిక పిండ ప్రదానం నిర్వహించనున్నట్లు ఆలయ అనువంశిక ధర్మకర్త దుగ్గిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు తెలిపారు. అత్యంత ప్రీతికరమైన మహాలయ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని పుష్పగిరి లక్ష్మీచెన్నకేశవ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఉదయం 8 గంటలకే కార్యక్రమం మొదలవుతుందని, మధ్యాహ్నం అన్నదానం ఉంటుందని తెలిపారు. కుల మతాలతో సంబంధం లేకుండా ఎవరైనా తమ పితృదేవతలతో బాటు పరమపదించిన వారెవరికై నా పిండ ప్రదానం చేయవచ్చునని తెలిపారు. దేవస్థానం తరుపున పిండ ప్రధానానికి కావాల్సిన పసుపు, కుంకుమ, తమలపాకులు, వక్కలు, పూలు, అగరుబత్తీలు, కర్పూరము, ఇస్తర్లు, బియ్యంపిండి, నువ్వులు, దర్బ పవిత్రములు, తదితర సామగ్రి ఉచితంగా అందజేస్తారన్నారు. భక్తులు తమతో బాటు పంచ, టవలు, చెంబు, గ్లాసులు, ఉద్ధరేణి లేదా స్పూను, అర్ఘ్య పాత్ర లేక తట్ట తీసుకురావాల్సి వుంటుందని తెలిపారు. వాటితోబాటు ఉన్నవారు యజ్ఞోపవీతం తీసుకుని రావాల్సి వుంటుందని, అవకాశం వున్న వారు తేనె, ఆవు పాలు, బెల్లం, పూలు, పండ్లు తమ శక్తికొలదీ తీసుకుని రావచ్చునని తెలిపారు.
నాలుగు ఆర్‌ఎంపీ క్లినిక్‌లు సీజ్
దువ్వూరు : నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న నాలుగు ఆర్‌ఎంపీ క్లినిక్‌లను డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ వి.మల్లేష్ శుక్రవారం సీజ్ చేశారు. డాక్టర్ వి.మల్లేష్ మాట్లాడుతూ ఆకస్మిక తనిఖీల్లో పరిమితికి మించి రోగులకు చికిత్స అందిస్తున్నట్లు తేలిందని, యాంటిబయోటిక్స్, సైలెన్ బాటిల్స్‌తోతమ పరిధికి మించి వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. అర్హతలు, అనుమతులు లేకుండా ఇలాంటి వైద్యం చేయడం రోగుల ఆరోగ్యానికి ప్రమాదకరమన్నారు. ఆర్‌ఎంపీలు డాక్టర్ అనే పదమే వాడకూడదని, కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే రోగులకు అందించాలని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా దువ్వూరులో కొన్ని ఆస్పత్రుల పేరుతో రోగులకు మంచాలు, ఆక్సిజన్, అనుమతి లేని హెవీ యాంటి బయోటిక్స్ మందులను వాడుతూ మల్టీ స్పెషాలిటీ స్థాయిలో క్లినిక్ నిర్వహిస్తున్నారన్నారు. మండలంలో ఎక్కడైనా ఆర్‌ఎంపీలు నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్‌లు పెట్టి రోగులకు వైద్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ సురేష్‌బాబు, హెల్త్ సూపర్‌వైజర్లు రాజగోపాల్, శివగంగరాజు, వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఎఫ్‌పీ షాపు ఆథరైజేషన్‌పై హైకోర్టు స్పందన
కడప సెవెన్‌రోడ్స్ : సింహాద్రిపురం మండలం రావులకొలను గ్రామ ఎఫ్‌పీ షాపు డీలర్ హరిత ఆథరైజేషన్ రద్దుపై రాష్ట్ర హైకోర్టు వివరణ కోరింది. పులివెందుల ఆర్డీఓ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎఫ్‌పీ షాపు డీలర్ హైకోర్టును ఆశ్రయించడంతో.. ఆ విధంగా కోర్టు స్పందించింది. డీలర్‌కు నాలుగు షోకాజ్ నోటీసులు జారీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో, ఇందుకు సంబంధించిన రికార్డులన్నింటినీ తీసుకుని శుక్రవారం తమ ఎదుట హాజరు కావాలని ఆర్డీఓను ఆదేశించింది.