
విద్యార్థులకు రాజ్యాంగంపై అవగాహన అవసరం
కడప ఎడ్యుకేషన్ : ప్రతి విద్యార్థి రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు అన్నారు. వైవీయూలోని న్యూ అడ్మినిస్ట్రేషన్ భవనంలోని అన్నమాచార్య సెనేట్ హాల్లో 75 సంవత్సరాల భారత రాజ్యాంగంపై నిర్వహిస్తున్న జాతీయ సదస్సు శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆచార్య శ్రీనివాసరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం పౌరులకు ఎలాంటి రక్షణ కల్పిస్తుందో ఇప్పటికీ చాలామందికి తెలియకపోవడం బాధాకరమన్నారు. సాంకేతిక పదజాలాన్ని సమకూర్చి సదస్సుల ద్వారా చైతన్యం చేస్తున్న కమిషన్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టెర్మినాలజీ(సి.ఎస్ టి.టీ) సిబ్బందిని ఆయన అభినందించారు. ప్రొఫెసర్ నవేద్ జమాల్ విద్యార్థుల ముంగిటకు విస్తృతంగా భారత రాజ్యాంగాన్ని తీసుకు వెళ్లాల్సిన బాధ్యత గురువులపై ఉందన్నారు. సిఎస్‌టీటీ ఏడీలు జెఎస్.రావత్, షాజాద్ అహ్మద్‌అన్సారీ మాట్లాడుతూ అంశాలు సమాచారయుతంగా, ప్రేరణాత్మకంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ డాక్టర్ డి.రవీంద్రసతీష్‌బాబు, ప్రొఫెసర్ ఏజీ దాము, ప్రొఫెసర్ వై.సుబ్బరాయుడు, డాక్టర్ కె.సీతామాలక్ష్మి, డాక్టర్ వీఎం.రాజశేఖర్ వివిధ అంశాలపై ఉపన్యాసం చేశారు. ఈ సదస్సులో పాల్గొన్న పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులకు వీసీ ఆచార్య శ్రీనివాసరావు, అతిథులు సర్టిఫికెట్లను అందజేశారు.
వైవీయూ వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు