
కుళ్లుతున్న ఉల్లి.. కన్నీళ్లే మళ్లీ
యార్డు, రైతు బజార్ల ద్వారా ఉల్లి కొనుగోళ్లు
● ప్రకటనలే పరిమితమైన
ఉల్లి కొనుగోలు కేంద్రాలు
● స్వయంగా జేసీ ప్రకటన చేసినా
స్పందన కరవు
● కొనుగోలు కేంద్రాలు తెరవని
మార్కెటింగ్ అధికారులు
● రెండు రోజుల వర్షంతో
రైతుకు కొలుకోలేని దెబ్బ
జిల్లాలోని మైదుకూరు, కమలాపురం మార్కెట్ యార్డులలో ఉల్లి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి మార్కెఫెడ్ ద్వారా క్వింటాల్ రూ.1200కు కొనుగోలు చేస్తామని ఈ నెల 4న జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. అనంతరం 15 రోజులు గడచినా అతీగతీ లేకపోవడంతోపాటు జేసీ ప్రకటన పేపర్‌కే పరిమితమైందా అంటూ ఉల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండలం సాగు విస్తీర్ణం
(ఎకరాల్లో)
మీన్‌పల్లి 4089.63
మైదుకూరు 1778.60
వేముల 1004.89
పెండ్లిమర్రి 825.22
దువ్వూరు 904,78
తొండూరు 693.95
వేంపల్లి 391.52
ఎర్రగుంట్ల 311.83
ముద్దనూరు 314.88
కాశినాయన 156.97
కడప అగ్రికల్చర్/సింహాద్రిపురం: జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటివరకూ 11347.67 ఎకరాల్లో రైతులు ఉల్లి పంట సాగు చేశారు. 92,300 క్వింటాళ్ల మేర దిగుబడులు వచ్చే అవకాశముందని అధికారులు ముందస్తు అంచనా వేశారు. చాలా మండలాల్లో ప్రస్తుతం ఉల్లి కోత దశలో ఉంది. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా ఆల్పపీడనం ఏర్పడి భారీ వర్షాలు కురిసాయి. దీంతో భూమిలోనే ఉల్లి కుళ్లిపోయే ప్రమాదం ఉండడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సింహాద్రిపురం మండలం అహోబిలం రైతు అంకాల్ రెడ్డి ఎకరాకు రూ.70 వేలు వెచ్చించి మూడు ఎకరాల్లో ఉల్లి సాగు చేయగా.. దిగుబడులకు గిట్టుబాటు లేకుండాపోయింది. కొనుగోలు చేస్తామన్న అధికారులు చేతులెత్తేయడం, వ్యాపారి ముందుకు రాకపోవడంతో రైతు ఉల్లి దిగుబడులను ఉచితంగా గ్రామ ప్రజలను తీసుకెళ్లమని చెప్పాల్సి వచ్చింది. ఈయనే కాదు.. మా ఘోష వినేవాళ్లే లేరా అని కన్నీళ్లు దిగమింగుతున్న రైతులు ఎందరో ఉన్నారు.
గోరుచుట్టుపై రోకటిపోటు
ఉల్లి పంటకు మద్ధతు ధర క్వింటా రూ.1200లకు కనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జాయింట్ కలెక్టర్ కొనుగోలుకేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పినా అనంతరం స్పందన లేకపోయింది. దీంతో ఒక పక్క మద్దతు ధర లేక.. మరోపక్క ప్రభుత్వం కొనుగోలు చేయక అల్లాడిపోతున్న ఉల్లి రైతుకు గోరుచుట్టుపై రొకటిపోటు అన్నట్లు ఆల్పపీడనంతో కురిసిన వర్షాలు మరింత కుంగదీస్తున్నాయి. కనీసం సాగు ఖర్చులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఆందోళన చెందుతున్నారు. క్వింటా రూ.500లు పలికితే పెట్టిన పెట్టుబడులు కూడా రావని, చేసిన అప్పులు తీరవని రైతులు వాపోయారు. ఎకరాకు లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెడితే కనీసం కూలి డబ్బు రాని పరిస్థితి ఉందని చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఉల్లి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తే రైతన్నలు మేలు జరుగుతుందని, లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ఉల్లి పంట సాగు చేసిన రైతులు తమ దిగుబడులను ఆయా మార్కెట్ యార్డులు, రైతు బజార్లలో విక్రయించుకోవచ్చు. వారు దిగుబడులు తీసుకువచ్చి అక్కడే ఎవరికై నా విక్రయించవచ్చు. రైతులు ఏ విధమైన గుర్తింపు కార్డులు చూపాల్సిన అవసరం లేదు. నేరుగా మార్కెట్ యార్డులు, రైతు బజార్లకు వెళ్లి కిలో రూ.12 ప్రకారం విక్రయించుకునే అవకాశం కల్పించాం. ఉల్లి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, కలెక్టర్, వైఎస్సార్ కడప జిల్లా

కుళ్లుతున్న ఉల్లి.. కన్నీళ్లే మళ్లీ

కుళ్లుతున్న ఉల్లి.. కన్నీళ్లే మళ్లీ