
22 నుంచి దసరా ఉత్సవాలు
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక పాత మార్కెట్‌లోని లలితాదేవి, రతనాల వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకూ దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ట్రస్టు కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. దేవీ శరన్నవ రాత్రులకు సంబంధించిన ఆహ్వాన పత్రాలను గురువారం వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దసరా వేడుకలలో భాగంగా రోజూ అమ్మవారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు. లోకకల్యాణార్థం లక్ష్మీగణపతిహోమం, సుదర్శన, పవమాన, అరుణ, సరస్వతి, రుద్ర, దుర్గా, చండీ హోమాలు, వేదపారాయణం యంత్ర ఆరాధన, జప పారాయణం నిర్వహిస్తామన్నారు. రతనాల వేంకటేశ్వరస్వామికి, స్వామివారి చెల్లెలు లలితాదేవి మూలవిరాట్‌లను పూలు, గాజులు, నగదు, కూరగాయలు, ముత్యాలకవచం, వత్తిపత్తితో అలంకరిస్తున్నామన్నారు. అసౌకర్యం కలుగకుండా బారీకేడ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఉద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదు
కడప ఎడ్యుకేషన్ : కూటమి ప్రభుత్వ తీరు మారకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆగ్రహానికి గురికాక తప్పదని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రణభేరి ప్రచార జాత గురువారం సాయంత్రం కడపకు చేరుకుంది. యూటీఎఫ్ నాయకులు సాదర స్వాగతం పలుకుతూ కడప ఆర్టీసీ బస్టాండ్ నుంచి మహావీర్ సర్కిల్, ఎర్రముక్కపల్లి సర్కిల్ మీదుగా బాలాజీ నగర్ యూటీఎఫ్ భవన్ వరకూ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఒకలా, ఎన్నికల తర్వాత మరొకలా పాలకులు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగులకు మెరుగైన వేతనాలను అమలు చేస్తామని, ఆరు నెలలలోగా ఆర్థిక బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత విస్మరించారన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు కె.సురేష్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శులు బి.లక్ష్మిరాజా, జయచంద్రారెడ్డి, నాయకులు మాదన విజయ కుమార్, పాలెం మహేష్, ఎస్.జాబీర్, సమీర్‌బాషా, నరసింహారావు, వై.రవికుమార్ డి.సుజాతరాణి, సివి.రమణ, ఎస్.ఎజాస్ అహమ్మద్, డి.క్రిష్ణారెడ్డి, సి.సుదర్శన్, ఎద్దు రాహుల్, వీరపోగురవి, తదితరులు పాల్గొన్నారు.
22 నుంచి డిగ్రీ విద్యాసంస్థల బంద్
కడప ఎడ్యుకేషన్ : డిగ్రీ కళాశాలలకు ఫీజు రీయంబర్స్‌మెంట్ నిధుల విడుదల కోరుతూ ఈ నెల 22వ తేదీ నుంచి డిగ్రీ విద్యా సంస్థల నిరవధిక బంద్ నిర్వహిస్తున్నట్లు వైవీయూ డిగ్రీ కాలేజీ ప్రైవేటు మేనేజ్‌మెంట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వెంకటశీను తెలిపారు. యోగివేమన యూనివర్సిటీ రిజిస్ట్రార్ పద్మనురాయన గురువారం కలిసి బంద్ నోటీసులు అందజేశారు. వెంకట శ్రీను మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రూ. 6400 కోట్ల బకాయిలు ఉన్నాయని, అనేకమార్లు అధికారులకు వినతిపత్రం అందించినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా, ఫీజులు వసూలు చేయకుండా ఉండాలని ప్రభుత్వం నుంచి హుకుం జారీ చేశారన్నారు. ఈ పరిస్థితుల్లో విద్యాసంస్థలు నిర్వహించలేక బంద్‌కు పిలుపునిచ్చామని తెలిపారు. సంజీవరెడ్డి, రవిశేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

22 నుంచి దసరా ఉత్సవాలు

22 నుంచి దసరా ఉత్సవాలు