
జగనన్న కాలనీలో చోరీ
వేంపల్లె : స్థానిక గండి రోడ్డులోని జగనన్న కాలనీలో చోరీ జరిగింది. బాధితురాలు వాణి వివరాల మేరకు.. స్థానిక జగనన్న కాలనీలో నివాసముంటున్న వాణి లిటిల్ ప్లవర్ పాఠశాలలోనూ, ఆమె భర్త నాగేంద్ర యూసీఐఎల్‌లో పనిచేస్తున్నారు. గురువారం ఉదయం ఇంటికి తాళాలు వేసి ఇరువురు విధులకు వెళ్లగా.. పట్టపగలే గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడినట్లు చెప్పారు. బీరువాలో రూ.50 వేల నగదు, ఎనిమిది తులాల బంగారు అభరణాలను దొంగలించినట్లు తెలిపారు. ఎస్‌ఐ తిరుపాల్ నాయక్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
విద్యుత్ మోటార్ల దొంగ అరెస్టు
బద్వేలు అర్బన్ : పగలు పాత సామాన్లు కొంటామని వచ్చి రాత్రి పొలాల వద్ద రైతులు ఏర్పాటు చేసుకున్న విద్యుత్తు మోటార్లను ఎత్తుకెళ్తున్న దొంగను బద్వేలు రూరల్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. స్థానిక రూరల్ పోలీసుస్టేషన్ ఆవరణలో విలేకరులకు మైదుకూరు డీఎస్పీ జి.రాజేంద్రప్రసాద్ వివరాలు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం ఎల్.ఆర్.పల్లిలోని ముస్లీం వీధికి చెందిన పాశంరాజేష్ వివిధ ప్రాంతాల్లో పాత సామాన్లు కొనుగోలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పగలు ఆయా గ్రామాల్లో తిరుగుతూ ఎవరికీ అనుమానం రాకుండా రాత్రిపూట విద్యుత్తు మోటార్లను చోరీ చేస్తున్నాడు. గత నెల 25న గోపవరం మండలం సండ్రపల్లెలో, ఈ నెల 10న బద్వేల్ మండలం వనంపులలోని పొలాల్లో విద్యుత్ మోటార్లు చోరీ చేసినట్లు రైతులు ఫిర్యాదు చేయడంతో విచారించిన పోలీసులు నిందితుడిని గోపవరం మండలం శ్రీనివాసపురం వద్ద నిందితుడిని అరెస్టు చేశారు. మూడు విద్యుత్ మోటార్లతో పాటు, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. రూరల్ సీఐ ఎన్.క్రిష్ణయ్య, ఎస్‌ఐ కె.శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
మెడికల్ క్యాంపు నిర్వహణపై విచారణ
కడప అర్బన్ : కడప నగరంలోని కేంద్ర కారాగారంలో 2023 నవంబర్, 28న మెడికల్ క్యాంపు నిర్వహణపై కర్నూలు ఎస్పీ విక్రాంత్‌పాటిల్, కడప జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నాగరాజు, విజయవాడ కారాగారం సూపరింటెండెంట్ ఇర్ఫాన్, కడప ఆర్డీవో జాన్ ఇర్విన్ గురువారం విచారించారు. కమిటీ అధికారుల ఎదుట క్యాంపు నిర్వహించిన డాక్టర్లు, అప్పటి కారాగార అధికారులు హాజరయ్యారు. విచారణలో వీరి స్టేట్‌మెంట్లను అధికారులు రికార్డు చేశారు.
పోలీసుల అదుపులో ఎర్రచందనం కూలీలు
ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరు మండలంలోని పెద్దశెట్టిపల్లె వద్ద గురువారం రాత్రి తమిళనాడు రాష్ట్రానికి చెందిన పలువురు ఎర్రచందనం కూలీలను కడప ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన 15 మంది కూలీలు రెండు వాహనాల్లో వెళ్తున్నారని సమాచారం రావడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు పెద్దశెట్టిపల్లె వద్ద కాపుకాచారు. ఈ క్రమంలో వారు అక్కడికి రాగానే పోలీసులు వాహనాలను అడ్డుగా పెట్టి ఎర్రచందనం కూలీలను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వారిని కడపకు తరలించారు. ప్రధాన స్మగ్లర్ కోసం పోలీసులు వారిని విచారణ చేస్తున్నారు. కూలీల వెనుక ఉన్నది జిల్లాకు చెందిన ప్రధాన స్మగ్లర్‌లా లేక ఇతర ప్రాంతాలకు చెందిన వారా అనేది తెలియాల్సి ఉంది.