
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం
కడప కార్పొరేషన్ : రాష్ట్రంలో పది మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాజీలేని పోరాటం చేయాలని నిర్ణయిచినట్లు వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య తెలిపారు. వైఎస్సార్ స్మారక ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష యువజన సంఘాలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిత్య మాట్లాడుతూ పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఒక్క కొత్త మెడికల్ కళాశాల కూడా తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 కొత్త మెడికల్ కాలేజీలను రాష్ట్రానికి మంజూరు చేయించి, అందులో 8 మెడికల్ కాలేజీలను పూర్తి చేసి తరగతులు ప్రారంభించారన్నారు. చంద్రబాబు సొంతజిల్లా అయిన చిత్తూరులోని మదనపల్లెలో 98 ఎకరాల్లో రూ.700 కోట్లు ఖర్చు చేసి మెడికల్ కాలేజీ నిర్మిస్తే దాన్ని కూడా ప్రైవేటీకరణ చేయడానికి పూనుకోవడం సిగ్గుచేటన్నారు. పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలు ప్రారంభం కావాల్సి ఉందన్నారు. పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్‌ఎంసీ 50 మెడికల్ సీట్లు కేటాయిస్తే వద్దని లేఖ ఇచ్చిన దద్దమ్మ ప్రభుత్వం ఇదేనని ధ్వజమెత్తారు. ప్రైవేటీకరణను రద్దు చేసేవరకూ పోరాటం ఆపేది లేదని, రాస్తారోకోలు, ముట్టడి కార్యక్రమాలతోపాటు, ఛలో అసెంబ్లీకి కూడా పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శులు రవి, చంద్ర, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గురుప్రసాద్, నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, ఏఐవైఎఫ్ నాయకులు ప్రభాకర్, ఏఐఎస్‌బి నాయకులు రాజేంద్ర, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.