
జల్సాలకు అలవాటుపడి.. చోరీల బాట
– రూ.8లక్షల బంగారు ఆభరణాలు స్వాధీనం
బద్వేలు అర్బన్ : జల్సాలకు అలవాటుపడి సులువుగా చోరీ చేస్తున్న ఇద్దరు యువకులను బద్వేల్ అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.8 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక అర్బన్ స్టేషన్ ఆవరణలో విలేకరులకు డీఎస్పీ జి.రాజేంద్ర ప్రసాద్ వివరాలు వెల్లడించారు. కడప నగరంలోని మరాఠి వీధికి చెందిన నారాయణ దిలీప్‌కుమార్, భాగ్యనగర్ కాలనీకి చెందిన షేక్‌నాయబ్‌రసూల్ స్నేహితులు. కడప నగరంలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న వీరు జల్సాలకు అలవాటుపడి చోరీలు చేయడం అలవాటు చేసుకున్నారు. నాలుగేళ్ల కిందట సొంత అన్న ఇంట్లోనే ఇరువురు కలిసి చోరీకి పాల్పడ్డారు. ఈ నెల 10న బద్వేల్‌కు వచ్చిన ఇరువురు వెంకటయ్యనగర్‌లో శ్రీనివాసులు ఇంటికి తలుపులు పగులకొట్టి చోరీకి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు విచారించిన పోలీసులు బద్వేల్–మైదుకూరు రహదారిలో నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 118.04 గ్రాముల బంగారు ఆభరణాలు, 40 గ్రాముల నాలుగు వెండి బిళ్లలు లభించాయన్నారు. అర్బన్ సీఐ లింగప్ప, ఎస్‌ఐలు సత్యనారాయణ, జయరామిరెడ్డి పాల్గొన్నారు.